Telangana Exhibitors Association: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అల్టిమేటం.. ఇకపై ప్రతి సినిమాకు పర్సంటేజ్ తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో విడుదలయ్యే ప్రతి సినిమాను పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శిస్తామని సంఘం స్పష్టం చేసింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 'పెద్ది' సినిమాకూ ఇదే నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. తాజాగా నిర్వహించిన సమావేశంలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. "మాకు 'పెద్ది' సినిమాకు కూడా పర్సంటేజ్ కావాలి. అది ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాలి. పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమా ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. నిర్మాతలు కావాలనే ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని ఆరోపించారు.
వివరాలు
పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శించాలి
ఇప్పటికే హరిహర వీరమలుల సినిమా సమయంలో కూడా తమ డిమాండ్‌ను ప్రస్తావించామని, అయితే అప్పట్లో ఇబ్బందులు తలెత్తకుండా వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అనంతరం పర్సంటేజ్ విధానంపై నిరంతరం చర్చలు కొనసాగుతున్నప్పటికీ నిర్మాతల నుంచి స్పష్టమైన నిర్ణయం రాలేదని పేర్కొన్నారు. 'పెద్ది' సినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ ఈ దశకు వచ్చిందని, అయినప్పటికీ ఈ సినిమాను వదిలేసి తర్వాతి పెద్ద సినిమాకు ఈ విధానాన్ని అమలు చేద్దామని కొందరు సూచించినట్లు వెల్లడించారు. మరోవైపు నిర్మాతలు మూడు వారాల సమయం కోరారని, కానీ ఇక ఆలస్యం చేయడం సరికాదని భావించి 'పెద్ది' సినిమాను కూడా పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వివరాలు
నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావు
టికెట్ ధరల పెంపుపై కూడా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచకూడదని సంఘాల తరఫున రేవంత్ రెడ్డికి మెమొరాండం సమర్పించినట్లు వెల్లడించారు. టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని, అలాంటి నిర్ణయాలతో సినిమాను నష్టపరచవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున ఇకపై ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే తమ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావు ఎన్నికయ్యారు.
వివరాలు
సిద్ధంగా ఉన్నాం
ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. థియేటర్లలో రెంట్ ట్రాక్ విధానాన్ని అమలు చేయడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఎలాంటి మోసాలు జరగడం లేదని, పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. అలాగే థియేటర్ల గ్రేడింగ్ విషయంలో సౌండ్ సిస్టమ్, ఏసీలు వంటి సౌకర్యాల ఆధారంగా కాకుండా, ఆయా థియేటర్లకు వచ్చే కలెక్షన్ల ఆధారంగానే గ్రేడింగ్ చేయాలని సూచించారు. అలాంటి విధానానికే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
తమకు ఎలాంటి వ్యతిరేకత లేదు
అదేవిధంగా, 'పెద్ది' సినిమాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఎగ్జిబిటర్లు తెలిపారు. "పెద్ది లాంటి సినిమాలకు మేము సెల్యూట్ చేస్తాం. ఆ సినిమాపై మాకు ఎలాంటి పగ లేదని పేర్కొన్నారు. మొదట ఈ వివాదం నుంచి 'పెద్ది' సినిమాను మినహాయించాలని భావించామన్నారు. అయితే ఆ సినిమా తర్వాత కూడా తమ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో స్పష్టత లేకపోవడంతో చివరకు ఆ సినిమాను కూడా ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.