Loading...
Rag Mayur : నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు నటుడి సత్తా.. ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్!
నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు నటుడి సత్తా.. ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్!

Rag Mayur : నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో తెలుగు నటుడి సత్తా.. ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైవిధ్యమైన కథలు, భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు రాగ్ మయూర్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్న ఆయనకు తాజాగా ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. 2021లో విడుదలైన 'సినిమా బండి' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన రాగ్ మయూర్, ఆ సినిమా విజయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం 'వీరాంజనేయులు విహారయాత్ర', 'కీడా కోలా', 'మిత్రమండలి', 'పరదా', 'గాంధీతాత', 'శుభం' వంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి సినిమాలో భిన్నమైన పాత్రలను పోషిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.

వివరాలు

ఉత్తమ నటుడిగా పురస్కారం

ఇక, సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ 'పంచాయత్'కు తెలుగు రీమేక్‌గా రూపొందిన 'సివరపల్లి' వెబ్ సిరీస్‌లో హీరోగా నటించి విశేష ప్రశంసలు అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన హీరోగా 'అనుమాన పక్షి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలో రాగ్ మయూర్‌కు ఉత్తమ నటుడు పురస్కారం లభించింది.

'సివరపల్లి' వెబ్ సిరీస్‌లో ఆయన చేసిన నటనకు గాను ఈ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డుల కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

వివరాలు

జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై హర్షం

ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించగా, దేశవ్యాప్తంగా ఎంపికైన విజేతల్లో తెలుగు నటుడు రాగ్ మయూర్ చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.

హీరోగా మాత్రమే కాకుండా కమెడియన్, విలన్ పాత్రల్లోనూ తనదైన శైలిలో మెప్పిస్తున్న రాగ్ మయూర్, వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు.

ఇప్పుడు ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకోవడంతో ఆయన కెరీర్‌కు మరో కీలక మైలురాయి చేరినట్లైంది.

ADVERTISEMENT