Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన రచించిన అనేక విషాద గీతాలు ఇప్పటికీ ఏవర్ గ్రీన్‌గా ఉంటాయి. ముఖ్యంగా, మోహన్ బాబు కోసం ఆయన ప్రత్యేకంగా పాటలు రాసేవారు. మోహన్ బాబుకు కూడా గురు చరణ్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది, అందుకే తన సినిమాల కోసం ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసేవారు. 'ముద్దబంతి పువ్వులో మూగబాసలు', 'కుంతీకుమారి తన కాలుజారి', 'బోయవాని వేటుకు గాయపడిన కోయిలా' వంటి అద్భుతమైన పాటలను మోహన్ బాబుకు అందించారు.
సినీ ప్రముఖులు, పాటల అభిమానులు దిగ్బ్రాంతి
గురు చరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. ఆయన 200కి పైగా పాటలు రాశారు. మోహన్ బాబు చిత్రాలలో కనీసం ఒక పాట అయినా గురు చరణ్‌తో రాయించేవారు. ఆయన అందించిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలు మోహన్ బాబు సినిమాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గురు చరణ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, పాటల అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గురు చరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.ఆయన అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం,దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు.గురు చరణ్ ఎం.ఏ వరకు విద్యను అభ్యసించారు.