మదిలో మది టీజర్: ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేమకథ
గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. ఆ సినిమాల మాదిరిగానే ప్రేక్షకులకు మంచి అనుభుతిని పంచడానికి మదిలో మది సినిమా వస్తోంది. జై, స్వీటీ, హీరో హీరోయిన్లుగా కనిపించిన ఈ చిత్ర టీజర్, ఈరోజు తాగుబోతు రమేష్ చేతుల మీదుగా రిలీజైంది. మొదటిసారి చూపులు కలుసుకున్న క్షణం నుండి పెళ్ళి, ఆ తర్వాత వ్యసనాలకు మగాడు బానిస కావడం వంటి సీన్లను ఈ టీజర్ లో చూపించారు. ఆ వ్యసనాల నుండి మగాడిని ఎలా రక్షించుకోవాలని భార్య పడే బాధ ఇందులో ఉందని తెలుస్తోంది. టీజర్ విడుదల చేసిన తాగుబోతు రమేష్, మాట్లాడుతూ, అందమైన ప్రేమకథను ప్రేక్షకులను పరిచయం చేయబోతున్నట్టుగా టీజర్ కనిపిస్తోందని అన్నారు.
ఆగస్టు 18న విడుదల
కొత్తవాళ్ళు సినిమా తీస్తే ఉండే కసి, ఎనర్జీ టీజర్ లో కనిపించిందని, ఇలాంటి కొత్త సినిమాను, కొత్త టీమ్ ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని తాగుబోతు రమేష్ అన్నారు. ఎస్ కే ఎల్ ఎమ్ (SKLM) క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను నేముకూరి జయకుమార్ నిర్మించారు. రచన, కథనం, మాటలతో పాటు సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. షారుక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస రావు పల్ల, సునీత, మనోహర్, వేణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 18వ తేదీన మదిలో మది సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.