గుంటూరు కారం సినిమా నుండి తనను తొలగించినట్లు వచ్చిన వార్తలపై థమన్ స్పందన
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట ఎంపికైన పూజ హెగ్డే తప్పుకుందని అన్నారు. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చిందని వినిపించింది. ఈ విషయమై మీనాక్షి చౌదరి కూడా స్పందించింది. గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలియజేసింది. అయితే, గుంటూరు కారం సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని తప్పించినట్లు అనేక వార్తలు వచ్చాయి. థమన్ అందించిన స్వరాలు మహేష్ బాబుకు నచ్చలేదని అందుకే థమన్ ని తప్పించారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయమై ఇప్పటివరకు సినిమా బృందం నుండి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా థమన్ స్పందించారు.
అధికారిక ప్రకటన వస్తేనే నిజం
గుంటూరు కారం సినిమా నుండి తనను తొలగిస్తే చిత్రబృందం నుండి అధికారికంగా ప్రకటన వస్తుందని, అలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదంటే తాను సినిమాలో కొనసాగుతున్నట్లు అర్థం చేసుకోవాలని ఒకానొక ఇంటర్వ్యూలో థమన్ అన్నారు. ప్రస్తుతం తాను గుంటూరు కారం మ్యూజిక్ సిటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నానని, ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నానని, ఆ కష్టం.. పాటలు రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు అర్థమవుతుందని థమన్ చెప్పుకొచ్చారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో ధమాకా బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోంది. ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం, 2024 జనవరి 13న విడుదల అవుతుంది.