R Madhavan: అందుకే నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నా.. కెరీర్ విరామంపై మాధవన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు ఆర్. మాధవన్ తన కెరీర్‌లో నాలుగేళ్ల విరామం తీసుకున్న కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2011 నుంచి 2015 వరకు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరంగా ఉన్న మాధవన్, 2016లో విడుదలైన 'సాలా ఖదూస్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'ఆ సమయంలో నేను చేస్తున్న పనిపై తీవ్ర నిరాశ కలిగింది. అందుకే కొంతకాలం పూర్తిగా విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాలుగేళ్ల పాటు సినిమాలకే కాదు... ప్రకటనల్లో కూడా నటించలేదు. ఆ సమయంలో దేశమంతా పర్యటించాను. గడ్డం పెంచుకుని చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు భారత్‌లోని అనేక అందమైన ప్రదేశాలు తిరిగానని మాధవన్ తెలిపారు.
Details
ముందుచూపు లేదు
తన ప్రయాణాల్లో సాధారణ ప్రజలతో మమేకమయ్యానని చెప్పారు. రిక్షా డ్రైవర్ల నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడాను. వారి జీవనశైలి, వారికి ఎదురయ్యే సమస్యలు, జీవిత పోరాటాలు దగ్గర నుంచి తెలుసుకున్నాను. ఆ నాలుగేళ్ల ప్రయాణం నాకు జీవితంపై ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని చెప్పారు. ఈ విరామం తర్వాత తాను చేయాలనుకున్న పాత్రలపై స్పష్టత వచ్చిందని మాధవన్ పేర్కొన్నారు. తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొందరు దర్శక నిర్మాతలకు ముందుచూపు లేదని గ్రహించానని తెలిపారు. అప్పటి నుంచే కొత్త ఆలోచనలతో ఉన్న యువ దర్శకులను వెతుకుతూ పనిచేయడం ప్రారంభించినట్లు వెల్లడించారు.
Details
ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాధవన్
ఇటీవల విడుదలైన 'ధురంధర్' సినిమాలో తన నటనతో మరోసారి ఆకట్టుకున్న మాధవన్, ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నారు. 'షూటింగ్ సమయంలో అందరూ నన్ను 'రెయిన్ మ్యాన్' అని పిలిచేవారు. నేను సెట్‌కు వెళ్లిన ప్రతిసారీ వర్షం పడేది. అందుకే ఆ పేరు వచ్చిందని నవ్వుతూ చెప్పారు. ఆ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు ఎండ లేకుండా, వర్ష వాతావరణంలోనే తెరకెక్కించారని తెలిపారు. ''అవి సినిమాకు మరింత సహజత్వం, అందాన్ని తీసుకొచ్చాయని మాధవన్ అన్నారు.