Matathi Mavie: 9 రోజుల్లో రూ.40 కోట్ల వసూళ్లు.. మరాఠీ చిత్ర పరిశ్రమలో 'దేవూల్ బంద్ 2' సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో పెద్దగా ప్రచారం లేకుండా విడుదలైన పలు ప్రాంతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. గుజరాతీ చిత్రం 'లాలో' సృష్టించిన సంచలన విజయాన్ని ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. ఇప్పుడు అదే జాబితాలో మరాఠీ చిత్రం 'దేవూల్ బంద్ 2' చేరింది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లోనే సుమారు రూ.40 కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వివరాలు
తొలి వారంలో రూ.6 కోట్ల వరకూ వసూళ్లు..
స్నేహల్ తార్డే, మోహన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రారంభంలో సుమారు 1,100 స్క్రీన్‌లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన, నోటి మాట ప్రచారంతో సినిమా వేగంగా ప్రజాదరణ పొందింది. దీంతో అదనంగా మరో 600 స్క్రీన్‌లలో ప్రదర్శించడం ప్రారంభించారు. తొలి వారాంతంలోనే రూ.5.90 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం సుమారు రూ.40 కోట్ల మార్క్‌ను చేరుకుని అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 మరాఠీ చిత్రాల్లో స్థానం సంపాదించింది. ఇటీవల విడుదలైన రితేశ్ దేశ్‌ముఖ్ నటించిన 'రాజా శివాజీ' రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వివరాలు
ఇంతకీ కథ ఏంటంటే..
సంగీత పేగుడే (స్నేహల్ తార్డే) ఒక మహిళా రైతు. జీవితమంతా కష్టాలతోనే సాగుతుంది. తన సమస్యలు తొలగించాలని ఆమె ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ఎలాంటి ఉపశమనం లభించదు. ఒకరోజు తీవ్ర నిరాశ, అసహనంతో నది ఒడ్డున ఉన్న చీమల పుట్టపై రాయిని విసురుతుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు శ్రీస్వామి సమర్థ్ దర్శనమిస్తారు. ఆనందంతో సంగీత ఆయనను తన గ్రామానికి తీసుకువస్తుంది. అయితే స్వామి సమర్థ్ ఆమెకు మాత్రమే కనిపిస్తారు. ఇతరులకు ఆయన కనిపించకపోవడంతో, ఎవరూ లేని చోట సంగీత మాట్లాడుతుండటాన్ని చూసి గ్రామస్తులు ఆమెకు మానసిక సమస్య వచ్చిందని భావిస్తారు.
వివరాలు
33 గంటల పాటు నిరవధికంగా సాగిన షూటింగ్..
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 'దేవూల్ బంద్ 2'లోని ఒక షెడ్యూల్‌ను దాదాపు 33 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా చిత్రీకరించినట్లు నటుడు మోహన్ జోషి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "ఆ రోజు షూటింగ్ ప్రారంభమైన తర్వాత వరుసగా సన్నివేశాలు చిత్రీకరిస్తూనే వెళ్లారు. ఎక్కడా ప్యాక్‌అప్ ప్రకటించలేదు. షూటింగ్ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. సమయం ఎంత అయిందో దర్శకుడికి చెప్పడానికి మాలో ఎవరూ ముందుకు రాలేకపోయాం. దాదాపు 30 గంటలు గడిచిపోయాయి. చివరకు నేను వెళ్లి విషయం చెప్పగా, 'అంత సమయం అయిపోయిందా? సరే, ఇంకో రెండు మూడు షాట్లు పూర్తి చేసి ముగిద్దాం' అని దర్శకుడు స్పందించారు" అని చెప్పారు.