Thaman : తలసేమియా బాధితులకు తోడుగా ఎన్టీఆర్ ట్రస్ట్ - తమన్ గ్రాండ్ మ్యూజికల్ నైట్ 'యుఫోరియా'
ఈ వార్తాకథనం ఏంటి
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ 'యుఫోరియా' పేరుతో అద్భుతమైన మ్యూజికల్ నైట్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 15న విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు బుక్ మై షో ద్వారా అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు తెలిపారు.
వివరాలు
నా కుటుంబం కోసం చేసే కార్యక్రమంలా అనిపిస్తోంది
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ, "మంచి ఆలోచనలతో మంచి పనులు మొదలవుతాయి. సమాజానికి సేవ చేయాలనే తపన గొప్ప విషయం. కొంతకాలం క్రితం ఓ వైరస్ కారణంగా మనం ఎన్నో పనులు నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు, ఆ వెనుకడుగు నుంచి ముందుకు రావాలని అనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి గారు సమాజానికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తులు. అలాంటి మంచి కార్యక్రమంలో భాగమవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా కుటుంబం కోసం చేసే కార్యక్రమంలా అనిపిస్తోంది" అని తెలిపారు.
వివరాలు
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. తమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మాట్లాడుతూ,"సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు"అనే స్ఫూర్తితో ఈ ట్రస్ట్ స్థాపించామన్నారు.
"తలసేమియా అనేది జన్యుపరమైన రక్తహీనత.దీనితో బాధపడే వ్యక్తులు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు.ఊపిరి తీసుకోవడంలో కూడా కష్టాలు పడతారు.అందుకే, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క రక్తదానం ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతుంది. తలసేమియా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం ఈ మ్యూజికల్ నైట్‌ను నిర్వహిస్తున్నాం. మా ఆలోచనకు తమన్ మద్దతు తెలియజేసి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఈ షో చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మహత్తరమైన సేవకు తమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు" అని అన్నారు.