The Paradise Review: ది ప్యారడైజ్ రివ్యూ.. నాని మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?
ఈ వార్తాకథనం ఏంటి
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్'పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్రకటనతో పాటు విడుదలైన గ్లింప్స్, టీజర్, 'ఆయా షేర్', 'ఏష నాగుల కట్ట' వంటి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ విడుదల చేయకుండానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా.. ప్రచారం విషయంలో మాత్రం ఎక్కడా లోటు కనిపించలేదు. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'ది ప్యారడైజ్' ఎలా ఉంది? అసలు జడల్ కథేంటి? గుర్తింపు కోసం సవారీ జాతి సాగించిన పోరాటం ఎలా ఉంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
వివరాలు
కథేంటి?
హైదరాబాద్‌కు సమీపంలోని ప్యారడైజ్ ప్రాంతంలో సవారీ జాతికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు.
ఈ సమాజానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ వారు భాగస్వాములయ్యారు.
అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాత్రం వారికి ఎలాంటి గుర్తింపు లభించదు.
జనాభా లెక్కల్లో వారి వివరాలు ఉండవు. ఓటు హక్కు కూడా ఉండదు. దేశ పౌరులుగా తమకు లభించాల్సిన రక్షణ,హక్కులు ఏవీ వారికి అందవు. తమ ఉనికినే ప్రభుత్వం, సమాజం పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం శికంజ్ మాలిక్ (మోహన్ బాబు). సవారీ జాతి ప్రజలు తమకు గుర్తింపు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా.. వారికి గుర్తింపు రాకుండా శికంజ్ అడ్డుకుంటుంటాడు.
వివరాలు
విశ్లేషణ
అసలు సవారీ జాతిపై శికంజ్‌కు ఎందుకంత వ్యతిరేకత? ఆ జాతిలో పుట్టిన జడల్ (నాని) తన ప్రజల కోసం ఎలాంటి పోరాటం చేశాడు? చివరికి సవారీ జాతికి గుర్తింపు దక్కిందా? అనేదే మిగతా కథ.
'ది ప్యారడైజ్' ఒక విప్లవాత్మక యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. తమ ఉనికిని,హక్కులను కాపాడుకునేందుకు సవారీ జాతి ప్రజలు చేసే పోరాటాన్ని కథకు ప్రధానాంశంగా తీసుకున్నారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథను యాక్షన్‌తో పాటు మదర్ సెంటిమెంట్,భావోద్వేగాలతో ముందుకు తీసుకెళ్లారు.
సవారీ జాతి ప్రజల జీవన విధానం, వారి చరిత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది.
వివరాలు
విశ్లేషణ
సమ్మక్క(సోనాలి కులకర్ణి)ఓ బిడ్డకు జన్మనివ్వడం, తన సమాజం కోసం ఆమె చేసే పోరాటం, మరోవైపు జడల్ అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్లడం వంటి సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జడల్ తన ప్రజల కోసం ఏం చేస్తాడనే అంశం ఆసక్తిని పెంచుతుంది.
శికంజ్ మాలిక్, అతని కుమారుడు రాఘవ్ పాత్రలు కథలో ప్రధాన సంఘర్షణకు కారణమవుతాయి.
జడల్‌కు వారితో ఉన్న విభేదాలను దర్శకుడు క్రమంగా పెంచుతూ తీసుకెళ్లారు.
ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితీయార్ధంలో కథ కొంత పక్కదారి పట్టినట్టుగా అనిపిస్తుంది.
సొంతంగా ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని ప్రకటించుకోవాలనే ఆలోచన కొంతవరకు వాస్తవికతకు దూరంగా అనిపిస్తుంది.
వివరాలు
నటీనటుల నటన
దర్శకుడి ఉద్దేశం వేరుగా ఉన్నప్పటికీ.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు పూర్తిగా నమ్మదగినవిగా అనిపించవు.
అయినప్పటికీ యాక్షన్, భావోద్వేగాలను కలిపి కథను నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.
జడల్ పాత్రలో నాని పూర్తిగా ఒదిగిపోయాడు. ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఇది నాని కెరీర్‌లో విభిన్నమైన మాస్ యాక్షన్ పాత్రగా చెప్పొచ్చు.
యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్టుగా తెలంగాణ యాసను కూడా చక్కగా పలికాడు.
సుబ్బు పాత్రలో కయాదు లోహార్ తన రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా కనిపించింది. ప్రేమకథకు పెద్దగా బలం లేకపోయినా.. సుబ్బు నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలు కొంత ఆసక్తిని కలిగిస్తాయి.
వివరాలు
నటీనటుల నటన
శికంజ్ మాలిక్‌గా మోహన్ బాబు పవర్‌ఫుల్‌గా కనిపించారు.ఆయన స్క్రీన్ ప్రజెన్స్ పాత్రకు బలాన్ని తీసుకొచ్చింది. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు కొత్తగా కనిపించాడు.
ఇలాంటి పాత్రలో ఆయనను చూడటం ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి హుందాగా నటించింది.
లాయర్ పాత్రల్లో కనిపించిన సత్యరాజ్,తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర ఎమ్మెల్యే శంకరన్న. ప్రియదర్శి పోషించిన ఈ పాత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉండేలా తీర్చిదిద్దారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్లలో మాట్లాడే తీరు,కొన్ని స్టేట్‌మెంట్లు, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్‌ను పోలిన అంశాలను ఈ పాత్రలో ఉపయోగించారు. ఈ సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
వివరాలు
టెక్నికల్‌గా ఎలా ఉంది?
అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
'ఆయా షేర్', 'ఏష నాగుల కట్ట' పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. ఈ పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
'ది ప్యారడైజ్' కోసం దర్శకుడు ప్రత్యేకమైన ప్రపంచాన్ని రూపొందించారు.
సినిమాటోగ్రఫీ ఆ ప్రపంచానికి తగ్గట్టుగా రా, రస్టిక్ టోన్‌లో సాగింది. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని చోట్ల జంప్స్ కనిపిస్తాయి.
కథను చాప్టర్లుగా విభజించడం ఆసక్తికరంగానే ఉన్నా.. ఒక చాప్టర్ నుంచి మరో చాప్టర్‌కు వెళ్లే సమయంలో భావోద్వేగాన్ని కొనసాగించడంలో అక్కడక్కడ కొంత తడబాటు కనిపిస్తుంది.
నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. సినిమా కోసం భారీ స్థాయిలో చేసిన నిర్మాణం తెరపై కనిపిస్తుంది.
వివరాలు
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
నాని నటన
పాటలు
యాక్షన్ సన్నివేశాలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో అక్కడక్కడ కనిపించే ల్యాగ్
కొన్ని సన్నివేశాలు పూర్తిగా కన్విన్సింగ్‌గా అనిపించకపోవడం
రేటింగ్: 3/5