Peddi: 'పెద్ది' ఫలితం ఎందరికో కీలకం.. విజయంతో మారనున్న సమీకరణాలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఒక భారీ విజయాన్ని కోసం ఎదురుచూస్తోంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'పెద్ది' ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం విజయం కేవలం పరిశ్రమకే కాకుండా, ఇందులో భాగమైన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఎవరున్నారు? వారికి ఈ విజయం ఎందుకు అంత ముఖ్యమైంది? తెలుసుకుందాం.
వివరాలు
రామ్‌చరణ్‌కు అత్యంత కీలకమైన చిత్రం?
'పెద్ది' విజయాన్ని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారిలో రామ్‌చరణ్ ముందుంటారు. 'రంగస్థలం' తర్వాత ఆయన నటనకు, వాణిజ్యపరమైన ఫలితాలకు సమానంగా నిలిచిన సినిమా ఇప్పటివరకు కనిపించలేదు. 'వినయ విధేయ రామ', 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. మధ్యలో వచ్చిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి చరణ్‌ను గ్లోబల్ స్థాయికి చేర్చినా, ఆ విజయాన్ని దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్‌తో పంచుకోవాల్సి వచ్చింది. అందువల్ల పూర్తిగా తన భుజాలపై నిలిచే విజయంగా 'పెద్ది'ను చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
బుచ్చిబాబు రెండో సినిమా పరీక్షలో విజయవంతమవుతారా?
తెలుగు సినీ పరిశ్రమలో రెండో సినిమా సవాల్ అనేది చాలామంది దర్శకులను వెంటాడిన అంశం. తొలి చిత్రంతో ఘనవిజయం సాధించిన తర్వాత రెండో సినిమాతో అదే స్థాయిని కొనసాగించలేకపోయిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. బుచ్చిబాబు 'ఉప్పెన'తో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఆయనకు గుర్తింపుతో పాటు అనేక పురస్కారాలను కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లపాటు 'పెద్ది' కథను తీర్చిదిద్దుతూ ఈ ప్రాజెక్టుపై కేంద్రీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో సినిమా సెంటిమెంట్‌ను అధిగమించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకోవడం బుచ్చిబాబుకు చాలా ముఖ్యం. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, ఆయన చూపిస్తున్న నమ్మకం చూస్తే ఈ సినిమాపై ప్రత్యేక విశ్వాసం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
జాన్వీ కపూర్‌కు మలుపు తిప్పే చిత్రమా?
దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి వచ్చిన జాన్వీ కపూర్‌కు ఇప్పటివరకు కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే భారీ విజయం దక్కలేదు. తెలుగులో 'దేవర' ద్వారా ఆమె ఆరంగేట్రం చేసినప్పటికీ, ఆ పాత్రకు ఆశించినంత గుర్తింపు లభించలేదు. 'పెద్ది'లో ఆమె 'అచ్చియ్యమ్మ' పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే పేర్కొన్నారు. అందువల్ల జాన్వీ కెరీర్‌లో ఈ చిత్రం ఒక కీలక మలుపు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో తన స్థాయిని బలపరచుకోవాలంటే ఈ సినిమా విజయం ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది.
వివరాలు
రెహమాన్‌కు కూడా ఇది ప్రత్యేక పరీక్షే..
ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సంగీతంతో అనేక భాషల్లో మాయ చేశారు. ముఖ్యంగా తమిళం, హిందీలో ఆయన అందించిన ఆల్బమ్‌లు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. అయితే తెలుగులో ఆయన నేరుగా పనిచేసిన చిత్రాల్లో సంగీతం విషయంలో ప్రేక్షకుల అంచనాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదనే అభిప్రాయం కొంతకాలంగా వినిపిస్తోంది. 'పెద్ది' నుంచి విడుదలైన 'చికిరి', 'రయ్ రయ్ రారా', 'హల్లో హల్లల్లో', 'మస్స మస్స' పాటలు ఆ సందేహాలను కొంతవరకు తొలగించాయి. ప్రభావవంతంగా నిలబెట్టడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే రెహమాన్ పనితీరుపై కూడా అందరి దృష్టి నిలిచింది.
వివరాలు
ఇతర నటుల ఆశలు కూడా 'పెద్ది'పైనే..
ఈ సినిమాలో గౌర్నాయుడు పాత్రలో నటించిన శివరాజ్‌కుమార్, అప్పలసూరి పాత్రలో కనిపించనున్న జగపతిబాబు, రామ్ బుచ్చి పాత్ర పోషించిన దివ్యేందు కూడా ఈ చిత్రంపై పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. వారి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే, భవిష్యత్తులో తెలుగులో మరిన్ని విభిన్నమైన, సవాళ్లతో కూడిన పాత్రలు చేసే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సినిమా ఫలితం వారికీ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.