Upcoming Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే క్రేజీ సినిమాలివే!
గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. దసరా పండగ సమీపిస్తున్న తరుణంలో, క్రేజీ చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి, అలాగే ఓటీటీ వేదికపై ప్రసారం కావడానికి సిద్ధమయ్యాయి. దసరా పండగకు ముందు థియేటర్, ఓటిటిలో రిలీజయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా 'దేవర'. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు, దేవర, వర అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
సెప్టెంబర్ 28న 'సత్యం సుందరం' రిలీజ్
తమిళ నటుడు కార్తి హీరోగా, '96' వంటి హిట్ ఫీల్-గుడ్ మూవీస్‌ని అందించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెయ్యజగన్'. ఈ సినిమాని తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రల్లో అరవింద్ స్వామి నటించగా, సూర్య-జ్యోతికల 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి మండపంలో కలిసే సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య కథ వినోదాత్మకంగా సాగుతుంది.
ఓటీటీలోకి సెప్టెంబర్ 26న 'సరిపోదా శనివారం'
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'సరిపోదా శనివారం' ఇటీవల థియేటర్లలో విడుదలై, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నానికి సరసన ప్రియాంక మోహన్, విలన్‌గా ఎస్.జె. సూర్య నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానుంది. 2015లో విడుదలై మంచి ఆదరణ పొందిన హారర్ మూవీ 'డిమోంటి కాలనీ'కి సీక్వెల్‌గా రూపొందిన 'డిమోంటి కాలనీ 2' ఇటీవల థియేటర్లలో హిట్ టాక్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 27 నుంచి జీ5 వేదికగా తెలుగు, తమిళ భాషల్లో ప్రసారం కానుంది.