టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ: రవితేజకు హిట్టు దొరికిందా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోవడంతో టాక్ బయటకు వచ్చేసింది. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను నెటిజన్లు బయటపెడుతున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ యాక్టింగ్ ఇరగదీసాడని అంటున్నారు. సినిమా మొదలు కావడంతోనే 1970, 80 సంవత్సరాల కాలానికి తీసుకెళ్లిపోయారని చెబుతున్నారు. నెగిటివ్ షేడ్స్ లో రవితేజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని ఎలివేషన్స్ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
పాటలు మైనస్, నేపథ్య సంగీతం ప్లస్
ప్రథమార్థం మొత్తం ఆసక్తిగా సాగిపోయిందని, తమ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు. రవితేజ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు సూపర్ గా ఉందని, ఈ విషయంలో దర్శకుడికి మంచి మార్కులు పడతాయని అంటున్నారు. నిర్మాణ విలువలు వెండితెర మీద కనిపిస్తున్నాయని, కాకపోతే గ్రాఫిక్స్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేశారని అనిపిస్తోందని, చాలాసార్లు తక్కువ నాణ్యత గల గ్రాఫిక్స్ తెరమీద కనిపిస్తాయని కామెంట్స్ పెడుతున్నారు. మరో విషయం ఏంటంటే, టైగర్ నాగేశ్వరరావు రన్ టైం మూడు గంటలు ఉండడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుందని, పాటలు చెప్పుకోదగినట్టుగా లేవని, నేపథ్య సంగీతం మాత్రం సీన్లను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉందని అంటున్నారు. మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.