Ticket Price: మళ్లీ రాజుకున్న టికెట్ ధరల వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోవడంతో నిర్మాతలు మరోసారి టికెట్ ధరల విధానంపై దృష్టి పెట్టారు. అయితే సినిమాల కథ, నాణ్యతపై చర్చ చేయకుండా కేవలం టికెట్ ధరల మార్పులే పరిష్కారమని భావిస్తున్నారు. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఫ్లెక్సీ టికెట్ ధరల విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. వారాంతాల్లో ఒక ధర, సాధారణ రోజుల్లో మరో ధర అమలు చేయడాన్నే ఫ్లెక్సీ ధరల విధానం అంటారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా ఇదే పద్ధతి తీసుకురావాలని నిర్మాతలు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఫ్లెక్సీ ధరలకు అనుమతి తెచ్చుకోవడం కంటే వాటిని ఎలా అమలు చేస్తారన్నదే కీలకంగా మారింది.
వివరాలు
అధిక టికెట్ ధరలపై ప్రేక్షకుల్లో అసంతృప్తి
ఇతర చిత్ర పరిశ్రమల్లో ఈ విధానం కొంతవరకు ఫలితాలు ఇస్తున్నా.. తెలుగులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద సినిమాల విడుదల సమయంలో మొదటి రెండు వారాలకే టికెట్ ధరలను ఒక్కసారిగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచితే ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని నిర్మాతలే భావిస్తున్నారు. ఇప్పటికే అధిక టికెట్ ధరలపై ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరిగింది. పెద్ద సినిమా విడుదలైతే కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లడం భారంగా మారుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన భారీ చిత్రాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మంచి స్పందన వచ్చిన సినిమాలకైనా అధిక ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు వెనుకడుగు వేసిన సందర్భాలు కనిపించాయి.
వివరాలు
ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఫ్లెక్సీ ధరలుఅమలు చేయడమే సవాల్
సాధారణ రోజుల్లో తక్కువ ధరలు, వారాంతాల్లో కొంత ఎక్కువ ధరలు ఉంటే ప్రేక్షకులు అంగీకరించే అవకాశం ఉంది. కానీ ఒక్కసారిగా భారీగా ధరలు పెంచితే మాత్రం పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గుతున్నారనే వాదనతో చిన్న సినిమాలను రెండు వారాల్లోనే, పెద్ద సినిమాలను నాలుగు వారాల్లోనే ఓటీటీ వేదికలకు విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మొత్తానికి ఫ్లెక్సీ ధరల విధానం తీసుకురావడం మాత్రమే కాదు.. దాన్ని ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా అమలు చేయడమే అసలు సవాల్‌గా మారింది.