Vishwa Karthikeya: ఇండోనేషియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
టాలీవుడ్ హీరోలు, దర్శకుల పనితనం చూసి హాలీవుడ్ మేకర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతి ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో రెపరెపలాడుతోంది. ఈ తరుణంలో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, తెలుగు హీరోగా గుర్తింపు పొందిన విశ్వ కార్తికేయ ( Vishwa Karthikeya) ఇండోనేషియా ప్రాజెక్టులో నటిస్తున్నాడు. టాలీవుడ్‌లో దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా విశ్వ కార్తికేయ నటించారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సినిమాల్లో విశ్వ నటించి మెప్పించారు. ప్రస్తుతం విశ్వకార్తికేయ హీరోగా 'కలియుగ పట్టణం' అనే ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆయుషీ పటేల్ కథానాయిక. ఇప్పుడు వీరిద్దరూ ఇండోనేషియన్ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.
వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న 'శూన్యం చాప్టర్-1'
'శూన్యం చాప్టర్-1' అంటూ వస్తున్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద వస్తున్న ఈ మూవీకి సీకే గౌస్ మోదిన్ దర్శక నిర్మాత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇండోనేషియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.