K. Rajan: కోలీవుడ్‌లో విషాదం.. బ్రిడ్జి నుంచి దూకి ప్రముఖ నిర్మాత ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నిర్మాత కె. రాజన్ ఇకలేరు. ఆయన ఇవాళ చెన్నైలోని ఓ బ్రిడ్జిపై నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మరణంతో సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, కె. రాజన్ చెన్నైలోని అడయార్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది.
వివరాలు
దర్శకుడు, నటుడిగా మంచి గుర్తింపు
తమిళ చిత్ర పరిశ్రమకు కె. రాజన్ అందించిన సేవలు విశేషమైనవి. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా రచయిత, దర్శకుడు, నటుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. 1983లో 'బ్రహ్మచారిగళ్' చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆయన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'డబుల్స్', 'అవల్ పావం', 'నినైకోత నాలియై' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1991లో నిజల్‌గల్ రవి, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ' సినిమాతో ఆయన దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించారు. అలాగే 'తంగమన తంగచ్చి', 'ఉనార్చిగల్' చిత్రాలకు ఆయన కథలను అందించారు. నటుడిగానూ 'మైఖేల్ రాజ్', 'సొంతక్కరన్', 'వీట్టోడ మాపిళ్లై' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వివరాలు
పలువురు ప్రముఖుల సంతాపం
ఇటీవల అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం తునివు, సెల్వరాఘవన్ దర్శకత్వంలోని 'బకాసురన్' చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. ఆయన వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కుమారుడు ప్రభుకాంత్ కూడా నటుడిగా అరంగేట్రం చేసి గుర్తింపు పొందారు. అనంతరం ఆర్జే బాలాజీ హీరోగా వచ్చిన సూపర్ హిట్ పొలిటికల్ సటైర్ చిత్రం 'ఎల్‌కేజీ'కి దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించారు. ఒక సీనియర్ నటుడు, నిర్మాత ఇలా ఆకస్మికంగా తనువు చాలించడం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ గాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.