
Fish Venkat: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (వయస్సు 53) కన్నుమూశారు. కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక చివరికి తుదిశ్వాస విడిచారు. వెంకట్ మృతి వార్త సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు సోషల్ మీడియా వేదికగా తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ చికిత్స కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్థికసాయం కూడా అందించారు.
Details
100 పైగా చిత్రాల్లో నటించిన అనుభవం
తెలుగు చిత్రసీమలో విలన్ల జాబితాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఫిష్ వెంకట్ అనేక చిత్రాల్లో మెయిన్ విలన్ పక్కన సహాయ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ నటించిన 'ఆది' చిత్రంలోని 'తొడకొట్టు చిన్నా' అనే డైలాగ్‌తో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్, ముషీరాబాద్ మార్కెట్‌లో చేపలు అమ్ముతుండడంతో ప్రజలు అభిమానంగా ఫిష్ వెంకట్ గా పిలవడం మొదలుపెట్టారు. తర్వాత అదే పేరు ఆయన సినీ జీవితానికి గుర్తింపుగా మారింది. తొలుత హాస్య పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన వెంకట్, 100కి పైగా చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనదైన నటనతో ప్రత్యేక ముద్రవేసిన ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటుగా నిలిచింది.