Vamsi Paidipally : మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో వంశీ పైడిపల్లి సినిమా?
ఈ వార్తాకథనం ఏంటి
హిట్ సినిమాలు తీసిన తర్వాత కూడా మూడేళ్లుగా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి మళ్లీ తెరపైకి రానున్నారని ఇండస్ట్రీ టాక్. తన 17 ఏళ్ల కెరీర్‌లో కేవలం ఆరు సినిమాలే తెరకెక్కించిన వంశీ, ఈ విషయంలో రాజమౌళికంటే కూడా 'స్లో' అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్‌బాబుతో చేసిన 'మహర్షి' ద్వారా నేషనల్ అవార్డు గెలుచుకున్న వంశీ, ఆ తర్వాత విజయ్‌తో చేసిన 'వారసుడు' సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన కొత్త సినిమాను ప్రకటించలేదు. గత మూడేళ్లలో బాలీవుడ్‌పై దృష్టి సారించిన వంశీ, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథలు వినిపించేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదని సమాచారం.
Details
పవన్ కళ్యాణ్ కోసం స్క్రీప్ట్ రెడీ చేసినట్లు సమాచారం
దీంతో ఆయన మళ్లీ టాలీవుడ్ వైపు దృష్టి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం, వంశీ పైడిపల్లి ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వొచ్చని టాలీవుడ్ వర్గాల సమాచారం. పవన్ ఈ కథను విని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్‌ల విషయంలో వేగంగా పనిచేయడాన్ని ఇష్టపడతారన్న విషయం తెలిసిందే. సాధారణంగా 40 రోజుల్లో తన భాగాన్ని పూర్తి చేయాలని ఆయన కోరుకుంటారు.
Details
టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్టుగా నిలిచే అవకాశం
కానీ వంశీ పైడిపల్లి సినిమాలు పూర్తి కావడానికి కనీసం 80 రోజులు పడతాయనే పేరుంది. ఈ స్పీడ్ తేడా కారణంగా వంశీ పవన్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందన్నది ఇంకా స్పష్టతలోకి రాలేదు. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ నిజమైతే, అది టాలీవుడ్‌లో పెద్ద ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని అంచనా. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం.