Venkatesh Birthday : విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న ఫ్యామిలీ స్టార్ వెంకీకి జన్మదిన శుభాకాంక్షలు
టాలీవుడ్ అగ్రహీరోల్లో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సినిమా స్టార్ పుట్టినరోజు నేడు(డిసెంబర్ 13) అగ్ర నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన వెంకటేష్, ఆ తర్వాత స్వయం శక్తితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మెచ్చే నటుడిగా ఎదిగారు. ముఖ్యంగా వెంకీ సినిమాలు కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా ఉండటం ఆయన స్టైల్. ఈ క్రమంలోనే కోట్లాది మంది మహిళా అభిమానులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు. 'కలియుగ పాండవులు'తో తెలుగు ఇండస్ట్రీలోకి అర్రంగేట్రం చేశారు. అతి తక్కువ కాలంలోనే విక్టరీ అనే పేరును సార్థకం చేసుకుని దగ్గుబాటి వెంకటేష్ కాస్త విక్టరీ వెంకటేష్ అయ్యారు.
38 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకోనున్న వెంకీ మామ
తొలి చిత్రం కలియుగ పాండవుల నుంచే తన నటన మార్క్ చూపించిన వెంకీ వరుస మాస్ సినిమాలతో అలరించాడు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా ఏ క్యారెక్టర్'లో అయినా ఇట్టే ఒదిగిపోతారు. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 14, వెంకటేశ్ హీరోగా 38 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 1986 ఆగష్టు 14న రిలీజైన 'కలియుగ పాండవులు'తొలి సినిమాలో నటనకు గాను ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు సాధించారు. 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏడు నంది అవార్డులు,6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.1971లో రిలీజైన ఏఎన్నార్ ప్రేమ్‌నగర్‌లో బాలనటుడిగా కనిపించిన వెంకటేశ్ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ ప్లేస్'లో వెంకీ
రామానాయుడు కలియుగ పాండవులును కృష్ణతో తెరకెక్కిద్దామనుకున్నారు. అప్పటి సూపర్ స్టార్ కృష్ణకి సమయం కుదరకపోవడంతో కృష్ణ ప్లేస్‌లో వెంకటేష్ హీరోగా వచ్చారు. త్వరలోనే సైంథవ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం 'సైంధవ్'ను (Saindhav) ప్రమోట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం దర్శకుడు శైలేష్ కొలను, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్'తో కలిసి విజయవాడ చేరారు. ఫలానా పాత్రలు చేయాలనే కోరికలు తనకు ఉండవని, అవకాశం వచ్చినప్పుడు ఆయా పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోతానన్నారు. భవిష్యత్తు కోసం తాను వేచి చూడనన్నారు. మంచి అవకాశం వచ్చినప్పుడు 100 శాతం న్యాయం చేయడమే తన పని అన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.