విజయ్ ఆంటోనీ కొత్త సినిమాకు విక్రమార్కుడు సింటిమెంట్
బిచ్చగాడు 2 సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ, తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాడు. బిచ్చగాడు మొదటి పార్ట్ అందుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోయినా కమర్షియల్ గా బాగానే వర్కౌట్ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం మరో డబ్బింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. తమిళంలో ఆల్రెడీ రిలీజైన తమిళరాసన్ అనే సినిమాను విక్రమ్ రాథోడ్ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మేరకు తెలుగులో టైటిల్ పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేసారు.రాజమౌళి, రవితేజ కాంబోలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోని పాపులర్ పోలీసు పాత్రపేరును సినిమాకు పెట్టడం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
యాక్షన్ సినిమాగా విక్రమ్ రాథోడ్
రవితేజ నటించిన విక్రమార్కుడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. మరి అలాంటి హిట్ రావాలని సెంటిమెంటుగా పెట్టారా? లేదా పవర్ ఫుల్ గా ఉందని పెట్టారా? లేదంటే సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచడానికి పెట్టారా అనేది చిత్రబృందానికే తెలియాలి. తెలుగులో రిలీజైన టైటిల్ పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖం మీద నెత్తుటి మరకతో ఉన్న విజయ్, కళ్ళలో ఎలాంటి భయం లేకుండా తుపాకీకి ఎదురుగా నిలబడ్డాడు. చూస్తుంటే యాక్షన్ సినిమాలాగా కనిపిస్తోంది. విక్రమ్ రాథోడ్ చిత్రాన్ని ఎస్ఎన్ఎస్ మూవీస్ బ్యానర్ పై రావూరి వెంకట స్వామి, ఆర్ కౌసల్యదేవి నిర్మించారు. ఈ సినిమాలో సురేష్ గోపీ, రెమ్యా నంబీసన్, సంగీత, సోనూసూద్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు.