Vijay Devarakonda: మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మార్చి 2న కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ స్వగ్రామం తుమ్మపేటలో సాంప్రదాయబద్ధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పెళ్లి అనంతరం తొలిసారిగా గ్రామంలో అడుగుపెట్టిన ఈ జంటకు గ్రామస్తులు హృదయపూర్వక స్వాగతం పలికారు. వ్రతం ముగిసిన తరువాత స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పెళ్లి విందు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున గ్రామస్థులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందించారు.
Details
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది
"సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి మంచి పనులు చేయాలనే కోరిక చాలా రోజుల నుంచే ఉంది. ఒక్కొక్కటిగా ఆ పనులను పూర్తి చేస్తూ ముందుకు సాగుదాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలాలు ఉన్నాయి. ఇకపై తరచూ గ్రామానికి వస్తాను" అని తెలిపారు. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు వెల్లడించారు.
Details
'రౌడీ జనార్ధన్', 'రణబాలి' చిత్రాలతో విజయ్ దేవరకొండ బిజీ
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వగ్రామ అభివృద్ధికి ముందడుగు వేసినందుకు ఆయనను అభినందిస్తున్నారు. గ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ సామాజిక బాధ్యతను చాటుకున్న విజయ్ దేవరకొండ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రౌడీ జనార్ధన్', 'రణబాలి' చిత్రాలతో బిజీగా ఉన్నారు.