Vijay Deverakonda : ఇచ్చిన హామీని అమలు చేసిన విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
హీరో విజయ్ దేవరకొండ తన స్వగ్రామం పట్ల ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల ఆయన తన జీవిత భాగస్వామి రష్మికతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేట గ్రామంలో నిర్మించిన ఇంటికి గృహప్రవేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అచ్చంపేట డివిజన్ విద్యార్థుల 'మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీ'ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన మొత్తం 45 మంది విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.
వివరాలు
విజయ్ దేవరకొండపై ప్రశంసల వెల్లువ..
ఈ పాఠశాలల్లో 9వ, 10వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. విజయ్ దేవరకొండ స్వగ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత మొదటి స్థానం, పి. ప్రణీత రెండో స్థానం సాధించి ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ ప్రథమ స్థానం, బి. అనిల్ ద్వితీయ స్థానం సాధించి ఈ ఉపకారవేతనానికి అర్హత పొందారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని విద్యార్థులకు ప్రోత్సాహం అందించడంతో గ్రామస్థులు, అభిమానులు విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.