LOADING...
VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత
తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత

VIjay Bhanu: తెలుగు, తమిళ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి విజయభాను కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ తరం వారికి విజయభాను పేరు సుపరిచితంగా ఉండకపోవచ్చు. కానీ 1970ల దశకంలో ఆమె సినీ రంగంలో వెలుగుతెచ్చారు. తెలుగు చిత్రసీమలోనే కాకుండా, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. అప్పటి అగ్రహీరోలందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న విజయభాను.. ప్రత్యేకంగా రాజబాబుతో జోడీగా మంచి క్రేజ్‌ అందుకున్నారు. కొన్నేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్న విజయభాను, గత నెలలో ఇండియాకు వచ్చారు. చెన్నైలోని తన ఇంటిని చూడటానికి వెళ్లిన ఆమెకు తీవ్రమైన ఎండ తట్టక, వడదెబ్బ తగిలింది. దీంతో ఆమె మృతిచెందారు. ఈ విషాదకర ఘటన సినీ వర్గాలను కలచివేసింది.

Details

దశదిన కర్మకు హాజరైన జయప్రద

విజయభానుకు ఒకే ఒక్క కుమార్తె ఉండగా, ఆమె అమెరికాలో ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తల్లి చివరిసారిగా తన ఇంటిని చూడాలనే ఉద్దేశంతో వచ్చిందా అనే సందేహం సన్నిహితులను కలవరపెడుతోంది. ఆమె చెన్నైలోనే మృతి చెందింది. విజయభానుకు సంబంధించిన దశదిన కర్మకు నటి జయప్రద హాజరై నివాళులర్పించారు. నటుడు సుమన్‌, దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి వంటి పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. తక్కువ కాలంలోనే వందకు పైగా సినిమాల్లో నటించి "విజయభానా మజాకా" అనిపించుకున్నారు. తెలుగు తెరకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ పాపులారిటీ సంపాదించి పాన్‌-ఇండియా నటి అనిపించారు.

Details

లాస్ ఏంజెల్స్ లో స్థిరపడ్డ విజయభాను

ఆమె స్వస్థలం అనంతపురం కాగా, బాల్యం, విద్యాభ్యాసం, సినీ జీవితమంతా చెన్నైలో సాగింది. ఓ అమెరికన్‌ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయభాను, లాస్‌ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు. అక్కడే 'శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్' అనే నాట్య పాఠశాల స్థాపించి భారతీయ శాస్త్రీయ నృత్యాలకు అంకితంగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌, కథకళి లాంటి అనేక శైలుల్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. విజయభాను మృతి పట్ల సినీ రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఒక గొప్ప నటి, నృత్యకళాకారిణి ఇకలేరు అన్న వార్త తెలుగు ప్రేక్షకుల్లో విషాదాన్ని నింపింది.