భోళాశంకర్ విడుదల ఆపాలంటూ కోర్టును అశ్రయించిన డిస్ట్రిబ్యూటర్
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆపాలంటూ విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ సతీష్ కోర్టును ఆశ్రయించారు. భోళాశంకర్ సినిమాను నిర్మించిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, తనను మోసం చేసారంటూ గాయత్రి ఫిలిమ్స్ యజమాని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ ఆరోపిస్తున్నారు. ఏజెంట్ సినిమా విషయంలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ కు గాను తాను 30కోట్లు చెల్లించినట్లు సతీష్ చెబుతున్నారు. అయితే ఏజెంట్ సినిమా సమయంలో తనకు కేవలం విశాఖపట్నం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అప్పజెప్పారని ఆయన వాదిస్తున్నారు. దానివల్ల తాను నష్టపోయానని సతీష్ అంటున్నారు.
సామజవరగమన సినిమాతో కొద్దిగా రికవరీ
ఈ విషయమై ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలను సంప్రదించగా, మిగతా సినిమా విడుదల సమయాల్లో నష్టాన్ని పూడుస్తామని చెప్పారని, సామజవరగన సమయంలో డిస్ట్రిబ్యూషన్ తనకు దక్కిందనీ, కానీ దానివల్ల రికవరీ కాలేదని అన్నారు. దాంతో, భోళాశంకర్ మీద ఆశలు పెట్టుకున్నట్లు తెలియజేసారు. కానీ ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు తన కాల్ లిఫ్ట్ చేయట్లేదని, అందువల్లే కోర్టును ఆశ్రయించానని చెప్పుకొచ్చారు. మరి ఈ కోర్టు విషయం ఏమవుతుందో చూడాలి. భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించింది. చిరంజీవి చెల్లెలుగా కిర్తి సురేష్ నటించింది. మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.