Vishal Dadlani : మోదీ ప్రభుత్వంపై కామెంట్స్.. 'ఇండియన్ ఐడల్' నుంచి విశాల్ దద్లానీ తొలగింపు?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీని 'ఇండియన్ ఐడల్ 16' జడ్జిగా కొనసాగించలేదనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాలపై తాజాగా విశాల్ దద్లానీ తనదైన స్టైల్‌లో స్పందిస్తూ గట్టి సమాధానం ఇచ్చారు.
వివరాలు
ఆ పోస్ట్‌పై కామెంట్స్ వైరల్..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మొదట ఆయన బాధగా ఏడుస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వెంటనే నవ్వుతూ "నేను ఇంకా ఇక్కడే ఉన్నాను బేబీ!" అంటూ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, "సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నిజమని నమ్మొద్దు. ఇక్కడ చాలా మాయచేసే ప్రచారం జరుగుతోంది. మనం నిజం కోసం పోరాడుతూ, చెప్పాల్సిన విషయాన్ని నిర్భయంగా చెప్పాలి" అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు విశాల్ ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు బాలీవుడ్‌లో ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించే అరుదైన వ్యక్తుల్లో మీరు ఒకరని కామెంట్లు చేస్తున్నారు.
వివరాలు
నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై అసంతృప్తి..
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై విశాల్ దద్లానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధపడుతున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం బాధాకరమని, దీనిపై సంబంధిత ప్రభుత్వ సంస్థలు బాధ్యత వహించకపోవడం మరింత ఆందోళనకరమని అన్నారు. అలాగే, దేశ పరిస్థితి ఇలాంటి స్థితికి చేరడానికి అధికారంలో ఉన్న కొందరి అజ్ఞానం కూడా కారణమని విమర్శించారు. కులం, మతం అనే భావాలకంటే విద్యావంతులు, సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనను షో నుంచి తొలగించారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.