Loading...
'Viswanath and Sons' Review: 'విశ్వనాథ్ అండ్ సన్స్' రివ్యూ .. సూర్యకు కుటుంబ కథతో హిట్ దక్కిందా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' రివ్యూ .. సూర్యకు కుటుంబ కథతో హిట్ దక్కిందా?

'Viswanath and Sons' Review: 'విశ్వనాథ్ అండ్ సన్స్' రివ్యూ .. సూర్యకు కుటుంబ కథతో హిట్ దక్కిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్నేళ్లుగా కుటుంబ కథాంశాలతో సినిమాలు తెరకెక్కడం తగ్గిపోయింది. ముఖ్యంగా అగ్ర కథానాయకులు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల యువ దర్శకులు మరోసారి కుటుంబ కథలపై దృష్టి పెడుతుండటంతో ఈ జానర్‌కు పూర్వ వైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళ కథానాయకుడు సూర్య కూడా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో అలాంటి ప్రయత్నమే చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? సూర్యకు మరో విజయాన్ని అందించిందా?

వివరాలు

కథేంటంటే?

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) సంపన్న కుటుంబానికి చెందిన వారసుడు. వ్యాపారవేత్తగా కొనసాగుతూనే షూటింగ్‌లో భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధిస్తాడు.

40 ఏళ్లు వచ్చినా అతడు మాత్రం పెళ్లి చేసుకోడు. తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలే అందుకు కారణం.

మరోవైపు అతడి తల్లి (రాధిక శరత్‌కుమార్) మాత్రం పెళ్లి చేసుకుని ఓ వారసుడిని కనాలని కొడుకుపై ఒత్తిడి చేస్తుంటుంది.

దీంతో సంజయ్ అమెరికా వెళ్లి సరోగసీ ద్వారా ఓ బాబును కనుకుని ఇండియాకు తీసుకొస్తాడు. అయితే అనూహ్యంగా ఆ చిన్నారి అనారోగ్యానికి గురవుతాడు.

చికిత్సలో భాగంగా అతడికి కన్నతల్లి అవసరమని వైద్యులు చెబుతారు. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని వెతుక్కుంటూ సంజయ్ మరోసారి అమెరికా వెళ్తాడు.

వివరాలు

ఎలా ఉందంటే?

ఇంతకీ సంజయ్‌కు తన బిడ్డ కన్నతల్లి దొరికిందా? ఆమె ఎవరు? ఆమె అమెరికా నుంచి భారత్‌కు రావడానికి అంగీకరించిందా? తన పెళ్లి విషయంలో తల్లి కోరికను సంజయ్ నెరవేర్చాడా? అతడి జీవితంలో మదన కామేశ్వరి అలియాస్ మ్యాడీ (మమిత బైజు) ఎలా అడుగుపెట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాల్సిందే.

'విశ్వనాథ్ అండ్ సన్స్' కుటుంబమంతా కలిసి చూసే స్వచ్ఛమైన వినోదం, భావోద్వేగాలతో తెరకెక్కింది. 'గజిని'లోని సంజయ్ రామస్వామి పాత్రను గుర్తు చేసేలా సూర్య పాత్రను తీర్చిదిద్దిన వెంకీ అట్లూరి.. దాని చుట్టూ హృదయాలను హత్తుకునే కుటుంబ కథను అల్లారు.

క్లాస్, పరిణతితో కూడిన రచనతో సూర్యలోని క్లాస్ నటుడిని ఆవిష్కరించిన తీరు సినిమాకు ప్రధాన బలం.

ADVERTISEMENT

వివరాలు

ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతి కలిగే అవకాశం

హీరో, హీరోయిన్ మధ్య వయసు వ్యత్యాసం, సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.

అయితే మాస్ పాత్రల్లో సూర్యను చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్తే మాత్రం కొంత భిన్నమైన అనుభూతి కలగొచ్చు.

సూర్య శైలికి తగ్గ కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి కూడా చాలా క్లాస్‌గా ఉంటాయి.

సంజయ్ అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. బిడ్డ అనారోగ్యానికి గురికావడం, కన్నతల్లి అవసరం ఏర్పడటం, ఆమె కోసం సంజయ్ మళ్లీ అమెరికా వెళ్లడంతో అసలు సంఘర్షణ మొదలవుతుంది.

సంజయ్, మ్యాడీ కలిసిన తర్వాత సినిమాలో సందడి పెరుగుతుంది.

ADVERTISEMENT

వివరాలు

అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు

ముఖ్యంగా సంజయ్ తల్లితో కలిసి మ్యాడీ చేసే అల్లరి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని సున్నితమైన సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది.

రాము (సునీల్‌రెడ్డి), రాధిక మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. హీరో-హీరోయిన్ వయసు వ్యత్యాసం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, సంభాషణలు ప్రథమార్ధంలో మంచి అనుభూతిని అందిస్తాయి.

సంజయ్-మ్యాడీ బంధం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే ఆసక్తిని పెంచుతూ ద్వితీయార్ధం మొదలవుతుంది. అయితే కోర్టు సన్నివేశాలు, ఆ తర్వాత చోటుచేసుకునే నాటకీయ పరిణామాలు పెద్దగా ఆకట్టుకోవు.

కొన్ని సందర్భాల్లో కథ ముందుకు సాగకుండా అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది.

రాధిక పాత్రకు సంబంధించిన నేపథ్యంతో వచ్చే మలుపు కథను అనూహ్యంగా మరో దారిలోకి తీసుకెళ్తుంది. దీంతో సినిమా కాస్త పక్కదారి పట్టినట్లుగా అనిపిస్తుంది.

వివరాలు

హుందాగా కనిపించిన సూర్య

అంజలీదేవి (రవీనా టాండన్), ఆమె కుమార్తె, తల్లిదండ్రులతో ముడిపడిన సన్నివేశాల్లో కొన్ని భావోద్వేగాలు పండాయి. నాజర్ పాత్రతో వచ్చే హాస్యం కూడా సినిమాకు కలిసొచ్చింది.

చివర్లో ఇచ్చిన ముగింపు కూడా చాలా క్లాస్‌గా ఉంటుంది. ఇలాంటి కథకు ఇదే సరైన ముగింపు అనిపించినప్పటికీ, మరింత హంగామా కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఇది పూర్తిగా సంతృప్తినివ్వకపోవచ్చు.

సూర్యలోని క్లాస్ నటుడిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న సినిమా ఇది. 'గజిని'లోని సంజయ్ రామస్వామిని గుర్తు చేసేలా సంజయ్ విశ్వనాథ్ పాత్రలో హుందాగా కనిపిస్తూ సూర్య ఆకట్టుకున్నారు.

వివరాలు

ఎవ‌రెలా చేశారంటే?

వయసుకు తగ్గ పాత్ర కావడంతో నటనలో మరింత సహజత్వం కనిపించింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

మ్యాడీగా మమిత బైజు మరో ఆకర్షణ. పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఆమె చక్కగా నటించింది.

కథానాయకుడి తల్లిగా రాధిక శరత్‌కుమార్ తనదైన నటనతో మెప్పించారు. సునీల్‌రెడ్డి, రవీనా టాండన్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.

అయితే సినిమా తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసిన తమిళ చిత్రమనే విషయం అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడు వెంకీ అట్లూరి రచన, మాటలు మాత్రం ప్రత్యేకంగా మెప్పిస్తాయి.

వివరాలు

బలాలు

సూర్య, మమిత బైజు నటన

హాస్యం, భావోద్వేగాలు

ప్రథమార్ధం

సంగీతం, విజువల్స్

బలహీనతలు

ద్వితీయార్ధంలో కొంత భాగం

కొన్ని సన్నివేశాల్లో నెమ్మదించే కథనం

తెలుగు డబ్బింగ్ సినిమా అనే భావన

చివరిగా: 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. స్వచ్ఛమైన కుటుంబ కథతో ఆకట్టుకునే ప్రయత్నం.

ADVERTISEMENT