Albert Wolsky: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్‌లో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ వోల్స్కీ కన్నుమూశారు. రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న ఆయన 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 'ఆల్ దాట్ జాజ్', 'బగ్సీ', 'గ్రీజ్' వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన వోల్స్కీ మరణ వార్తను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ క్రిస్టోఫర్ లారెన్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "ఆల్బర్ట్ వోల్స్కీ గొప్ప మనిషి. ఆయన స్నేహం, మార్గదర్శకత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ భావోద్వేగంగా పోస్టు చేశారు.
వివరాలు
బ్లాక్ ప్యాంట్స్ అప్పట్లో భారీగా పాపులర్..
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 'గ్రీజ్' సినిమాలోని ఐకానిక్ 1950ల కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసింది కూడా వోల్స్కీయే. ముఖ్యంగా ఒలీవియా న్యూటన్-జాన్ ధరించిన బ్లాక్ లెదర్ జాకెట్, స్కిన్‌టైట్ బ్లాక్ ప్యాంట్స్ అప్పట్లో భారీగా పాపులర్ అయ్యాయి. అవి నిజానికి 1950ల నాటి వింటేజ్ దుస్తులేనని ఒలీవియా తన ఆత్మకథలో వెల్లడించారు. "అవి చాలా పాతవి. ఒక్క జత మాత్రమే ఉండటంతో చిన్న తప్పిదానికీ అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉపయోగించాల్సి వచ్చేది" అని ఆమె పేర్కొన్నారు. తర్వాత 2019లో స్ప్యాంక్స్ వ్యవస్థాపకురాలు సారా బ్లేక్లీ ఆ ప్యాంట్స్‌ను చారిటీ వేలంలో 1.62 లక్షల డాలర్లకు కొనుగోలు చేశారు.
వివరాలు
భారీ సినిమాలకు పనిచేసిన ఆల్బర్ట్..
ఆల్బర్ట్ వోల్స్కీ తన కెరీర్‌ను 1960లలో ప్రారంభించారు. మొదట బ్రాడ్‌వేలో 'కామెలాట్' ప్రొడక్షన్‌తో పని చేసిన ఆయన, తర్వాత 'ది హార్ట్ ఈజ్ ఎ లోన్లీ హంటర్', 'ది డెస్పరేట్ అవర్స్', 'ఆఫ్ మైస్ అండ్ మెన్', 'ఎ హ్యాట్‌ఫుల్ ఆఫ్ రేన్' వంటి చిత్రాలకు కాస్ట్యూమ్స్ రూపొందించారు. అనంతరం ఆండ్రూ బెర్గ్‌మన్ తెరకెక్కించిన 'స్ట్రిప్‌టీజ్', కార్ల్ రైనర్ దర్శకత్వంలోని 'ఫేటల్ ఇన్‌స్టింక్ట్', నోరా ఎఫ్రాన్ రూపొందించిన 'యువ్ గాట్ మెయిల్', గ్యారీ మార్షల్ 'రన్‌వే బ్రైడ్', వేన్ వాంగ్ తెరకెక్కించిన 'మేడ్ ఇన్ మాన్‌హాటన్' వంటి చిత్రాలకు కూడా పని చేశారు. ఆయన చివరిసారిగా డేవిడ్ ఓ రస్సెల్ దర్శకత్వంలోని 'ఆమ్‌స్టర్‌డామ్' సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.
వివరాలు
రెండు సార్లు ఆస్కార్
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో 20కిపైగా అవార్డు నామినేషన్లు దక్కాయి. అందులో ఏడు అకాడమీ అవార్డు నామినేషన్లు కూడా ఉన్నాయి. 'సోఫీస్ చాయిస్', 'ది జర్నీ ఆఫ్ నాటీ గాన్', 'టాయ్స్', 'అక్రాస్ ది యూనివర్స్', 'రెవల్యూషనరీ రోడ్' చిత్రాలకు చేసిన కాస్ట్యూమ్ డిజైన్‌కు ప్రశంసలు అందుకున్నారు. 'ఆల్ దాట్ జాజ్' చిత్రానికి 1980లో, 'బగ్సీ' చిత్రానికి 1992లో ఆస్కార్ అవార్డులు అందుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.