LOADING...
Lokesh Kanagaraj: #AA23పై వస్తున్న రూమర్లకు చెక్.. కీలక అప్డేట్ ఇచ్చిన రత్నకుమార్
#AA23పై వస్తున్న రూమర్లకు చెక్.. కీలక అప్డేట్ ఇచ్చిన రత్నకుమార్

Lokesh Kanagaraj: #AA23పై వస్తున్న రూమర్లకు చెక్.. కీలక అప్డేట్ ఇచ్చిన రత్నకుమార్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 04, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం #AA23 పేరుతో ఈ ప్రాజెక్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమాపై సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ వార్తలు ప్రచారం కావడంతో అభిమానుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర రచయిత రత్నకుమార్ స్పందిస్తూ ఆ వార్తలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు.

వివరాలు

సినిమా రద్దు నిజమేనా?

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'విక్రమ్' చిత్రం విడుదలై జూన్ 3 నాటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రత్నకుమార్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు. సినిమా ప్రారంభ సమయంలో లోకేశ్ షేర్ చేసిన పోస్టును మళ్లీ పంచుకుంటూ, అది తర్వాత సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. అలాంటి విజయవంతమైన ప్రయాణంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాపై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. అలాగే #AA23 హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. దీంతో సినిమా రద్దు కాలేదని, పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టత వచ్చింది.

వివరాలు

రాకా షూట్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. 

ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో విడుదల చేసిన థీమ్ సాంగ్ విశేష ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ సృష్టించిన ఆ మ్యూజిక్ పీస్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో 3.55 లక్షలకు పైగా రీల్స్ రూపొందాయి. దీంతో అత్యధిక సంఖ్యలో రీల్స్‌కు ప్రేరణగా నిలిచిన థీమ్ సాంగ్‌గా ఇది ప్రత్యేక రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకొణె కథానాయికగా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లోని #AA23 ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement