మెగాస్టార్ నెక్స్ట్: చిరంజీవి చేసిన మార్పులకు ఒప్పుకున్న యంగ్ డైరెక్టర్?
వాల్తేరు వీరయ్య విజయం సాధించడంతో చిరంజీవి, తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో భోళాశంకర్ సినిమా మాత్రమే ఉంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి ఎలాంటి సినిమా చేస్తాడనేది ఇంకా బయటకి రాలేదు. నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండనుందని అప్పుడెప్పుడో ప్రకటన వచ్చింది. కానీ అది ఇంకా ముందుకు కదలలేదు. వెంకీ కుడుముల చిరంజీవికి కథ వినిపించారు. కానీ అందులో కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి సూచించినట్లు సమాచారం. మొదట్లో వెంకీ కుడుముల, కథలో పెద్దగా మార్పులు చేయలేదని, కానీ వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి సూచించిన మార్పులను పరిగణలోకి తీసుకున్నాడని అంటున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా స్క్రిప్ట్ లో చిరంజీవి హస్తం
వాల్తేరు వీరయ్య స్క్రిప్ట్ లో దర్శకుడు బాబీకి చిరంజీవి చాలా సలహాలు ఇచ్చినట్లు, అవన్నీ సినిమా విజయానికి తోడ్పడినట్లు చెప్పుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య 200కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సినిమా నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కమర్షియల్ సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటే బాగుంటుందో చిరంజీవి బాగా అంచనా వేస్తారని, చిరంజీవి చెప్పిన మార్పులతో సినిమాను రూపొందిస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్మిన వెంకీ కుడుముల, తన స్క్రిప్ట్ లో మార్పులకు ఒప్పుకున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా ఉంటారని గతంలోనే ప్రకటించారు. మరి చిరంజీవి డైరెక్ట్ చేసే అవకాశం వెంకీకి వస్తుందా అనేది చూడాలి.