బాలయ్య 125 దాటేసాడు, చిరంజీవి 200 చేరుకోబోతున్నాడు
సంక్రాంతి సందర్భంగా వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. రిలీజై రెండు వారాలు అవుతున్నా కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను తెచ్చుకుంటున్నాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య కంటే ఒకరోజు ముందుగా బాలయ్య వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా, 25-45శాతం సామర్థ్యంతో దూసుకుపోతోంది. రిలీజైన 12వ రోజు నాడు 2.5 కోట్ల కలెక్షన్లు సాధించింది వీరసింహారెడ్డి. ఈ సినిమాకు సీడెడ్ ఏరియా నుండి ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే, రిలీజైన 11వ రోజు నాడు 4.5కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇంకా 35-55శాతం సామర్థ్యంతో నడుస్తోంది. ఐతే తొందర్లో వాల్తేరు వీరయ్య ఖాతాలో ఒక రికార్డ్ చేరనుంది.
రెండు వందల కోట్ల వైపు దూసుకుపోతున్న వాల్తేరు వీరయ్య
వాల్తేరు వీరయ్య స్పీడు చూస్తుంటే మరికొద్ది రోజుల్లో 200కోట్ల క్లబ్ లో చేరనుందని అంచనా . ఆల్రెడీ ఇంచ్ దూరంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వీరసింహారెడ్డి సినిమా, 125కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమాకు పెట్టిన బడ్జెట్ వాల్తేరు వీరయ్య కంటే తక్కువ. అదీగాక వాల్తేరు వీరయ్య సినిమాను హిందీలోనూ రిలీజ్ చేసారు. వీరసింహారెడ్డి యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అయితే, వాల్తేరు వీరయ్య మాత్రం డ్రగ్స్ మాఫియా, బ్రదర్ సెంటిమెంట్ తో కూడి ఉంది. ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడం విశేషం. మొత్తానికి ఈ సంక్రాంతి, అటు బాలయ్యకు ఇటు చిరంజీవికి బాగా కలిసి వచ్చిందని జనాలు చెప్పుకుంటున్నారు.