Zindagi Na Milegi Dobara: 'జిందగీ నా మిలేగీ దోబారా' సీక్వెల్‌కు జోయా అక్తర్ సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం రోడ్ ట్రిప్ నేపథ్యంతో ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన అనుబంధం,భావోద్వేగాలు,వినోదాన్ని మేళవించి తెరకెక్కిన చిత్రం 'జిందగీ నా మిలేగీ దోబారా'. హృతిక్ రోషన్, అభయ్ దేఒల్, ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హిందీ సినిమా మంచి స్పందన పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా విశేష వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ వస్తుందన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో హృతిక్ కూడా ఈ చిత్రానికి సీక్వెల్ తప్పకుండా వస్తుందని,అయితే అది ఎప్పుడనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
వివరాలు
డ్రాఫ్ట్ పూర్తి
తాజాగా ఈ సీక్వెల్‌పై దర్శకురాలు జోయా అక్తర్ సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. 'జిందగీ నా మిలేగీ దోబారా'కి సీక్వెల్ తెరకెక్కించాలంటే కొత్తగా చెప్పడానికి ఏదైనా బలమైన అంశం ఉండాల్సిందేనని జోయా ఎప్పుడూ భావించేవారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎప్పట్నుంచో ఈ సీక్వెల్ కోసం రూపొందించాలని అనుకున్న డ్రాఫ్ట్‌ను తాజాగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కథను కేవలం మొదటి చిత్రంలోని జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసేలా కాకుండా, ఆ ముగ్గురు పాత్రల జీవితాల్లో వచ్చిన మార్పులు, వారి ప్రయాణంలో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా రూపొందించాలని ఆమె యోచిస్తున్నారట.
వివరాలు
నటులతో చర్చలు జరుపుతున్న జోయా అక్తర్
ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలి భాగంలో నటించిన హీరోలందరినీ మరోసారి ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావాలన్నదే ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. నటులందరి డేట్స్ అనుకూలంగా కుదిరితే త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన విషయాలపై జోయా అక్తర్ నటులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం.