APSRTC: ఏపీఎస్ఆర్టీసీలోకి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు.. విద్యుత్ చార్జీల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు రూ.3.90కి తగ్గించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రూడౌన్ ఫలితాల వల్ల వచ్చే లాభాలు నేరుగా ప్రజలకే చేరేలా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. అలాగే విద్యుత్ ఉత్పత్తిలో నికర-సున్నా ఉద్గార విధానాన్ని అమలు చేసే దిశగా ముందడుగులు వేయాలని సూచించారు. గతంలో విద్యుత్ కొరతను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారే దిశగా క్రమంగా పురోగమిస్తోందని తెలిపారు. వేగవంతమైన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులు, పవన విద్యుత్ ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, పీఎం-కుసుమ్ పథకాలు ప్రస్తుతం అత్యవసరమని సీఎం పేర్కొన్నారు.
Details
కుప్పంలో 5,000కు పైగా ఈ-సైకిళ్లను పంపిణీ
పర్యావరణహిత రవాణాలో భాగంగా కనీసం 1,000 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని వెల్లడించారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో 5,000కు పైగా ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు, అవసరం లేని సిజేరియన్ డెలివరీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ను ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ప్రకటిస్తామని వెల్లడించారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి, జూన్ నాటికి సమగ్ర ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని తెలిపారు.
Details
భవిష్యత్తులో 400 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
అలాగే మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 220 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యానవన ఉత్పత్తులతో ముందున్న రాయలసీమను, భవిష్యత్తులో 400 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం కేంద్ర నిధులు, ప్రైవేట్ పెట్టుబడులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు నాలుగు లేన్ల రైల్వే లైన్, స్పీడ్ రైలు ప్రాజెక్టుల పురోగతికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చిన్న రైస్ మిల్లును ఏర్పాటు చేయాలంటే 30కిపైగా అనుమతులు అవసరం కావడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి విరుద్ధమని చంద్రబాబు గుర్తుచేశారు.
Details
అనుమతుల కోసం సింగిల్-విండో వ్యవస్థను అమలు చేయాలి
అగ్నిమాపక సేవలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అటవీ, పాఠశాల విద్య వంటి విభాగాల్లో నియమాలను సరళీకరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇసుక, మైనింగ్ అనుమతుల కోసం సింగిల్-విండో వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇసుక, కంకర సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.