Hyderabad: హైదరాబాద్ జిల్లాలో 1.3 లక్షల ఓట్లు రద్దు.. కారణమిదే!
హైదరాబాద్ జిల్లాలోని ముసాయిదా ఓటరు జాబితా తాజాగా విడుదలైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం ప్రకారం, ఫిబ్రవరి 8, 2024 నాటి జాబితాతో పోలిస్తే, జిల్లాలో మొత్తం 1.3 లక్షల ఓట్లను తొలగించారు. ఇద్దరికి ఒకే సమయంలో రెండు గుర్తింపు కార్డులు కలిగి ఉండటం, మరణాలు, ఇళ్లను ఖాళీ చేయడం వంటి కారణాల వల్ల ఈ ఓట్లను తొలగించినట్లు అధికారులు ధ్రువీకరించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అత్యధికంగా 22,002 ఓట్లు తొలగించడం గమనార్హం. ఇక ముషీరాబాద్‌లో 15,940, జూబ్లీహిల్స్‌లో 12,160, కార్వాన్‌లో 12,081 ఓట్లు రద్దయ్యాయి.
3,984 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
అటు కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్పించిన వారిలో చాంద్రాయణగుట్టలో 27,789 మంది, ముషీరాబాద్‌లో 17,937, యాకుత్‌పురలో 14,271, జూబ్లీహిల్స్‌లో 14,241, కార్వాన్‌లో 13,454 మంది ఉన్నారు. యాకుత్‌పురలో ఓటర్ల పెరుగుదల 2.49 శాతం వద్ద నమోదైంది. ఇది అత్యధిక శాతం. మొత్తం 3,984 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముసాయిదాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నవంబర్ 28 వరకూ స్వీకరిస్తామని, అన్ని పరిష్కరించిన తర్వాత తుది జాబితాను జనవరి 6, 2025న విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.