Page Loader
Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన
1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన

Kakinada: 1,320 టన్నుల రేషన్ బియ్యం సీజ్‌.. కలెక్టర్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలనతో కదలిక వచ్చిన కాకినాడ పోర్టు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. నవంబర్ 29న పవన్ కళ్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకను పరిశీలించిన తర్వాత అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. డిప్యూటీ సీఎం పరిశీలన అనంతరం ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్‌లో 12 గంటల పాటు సోదాలు నిర్వహించారు. నౌకలో ఉన్న 5 కంపార్ట్‌మెంట్ల నుంచి 12 శాంపిల్స్‌ సేకరించామన్నారు.

Details

నిబంధనలు మరింత కఠినతరం

మొత్తం 4,000 టన్నుల బియ్యం ఉండగా, అందులో 1,320 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని కలెక్టర్ తెలిపారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్‌ ద్వారా ఈ బియ్యం ఎగుమతి జరుగుతున్నట్లు గుర్తించారు. వారు బియ్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ నిల్వచేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 1,320 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేసి సీజ్ చేస్తామని, ఇకపై నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Details

అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు

కాకినాడ పోర్టులో ఇంకా 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సి ఉందని, వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. కాకినాడ యాంకేజ్‌ పోర్టు, డీప్‌ వాటర్‌ పోర్టులో అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఒక్క గ్రాము పీడీఎస్‌ బియ్యం కూడా దేశం దాటకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, బియ్యం వ్యాపారం నిజాయతీగా చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ స్పష్టంచేశారు