CM Chandrababu: 2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ అందించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ (బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి) పనులను వచ్చే ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్నవి, డీపీఆర్ దశలో ఉన్నవి కలిపి దాదాపు రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులన్నీ 2029 నాటికి పూర్తయ్యేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
వివరాలు
రాష్ట్రంలో ఎన్‌హెచ్‌లన్నీ 4, 6 వరుసలుగా విస్తరించేలా ప్రణాళిక
గురువారం క్యాంప్ కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ సంఖ్యలో రహదారుల ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు లైన్లుగా ఉన్న జాతీయ రహదారులను వాహనాల రద్దీని బట్టి నాలుగు లేదా ఆరు లైన్లుగా విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పోర్టులకు జాతీయ రహదారులతో పటిష్టమైన అనుసంధానం ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను ఎన్‌హెచ్‌లతో కలపాలని సూచించారు.
వివరాలు
పోర్టులన్నీ హైవేలతో అనుసంధానం కావాలి
పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు సరైన కనెక్టివిటీ ఉండేలా రహదారుల అభివృద్ధి జరగాలని చెప్పారు. నాగ్‌పూర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు, అలాగే జగదల్‌పుర్, రాయ్‌పుర్‌ల నుంచి మూలపేట పోర్టుకు అనుసంధానం చేసే రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖరగ్‌పుర్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన సిద్ధం చేయాలని, ప్రాధాన్యక్రమంలో వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని పనులు వేగంగా ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు.
వివరాలు
ఆర్‌అండ్‌బీ రోడ్లలో ఎక్కడా గుంతలు కనిపించకూడదు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో 12 రహదారుల విస్తరణ పనులను ప్రారంభించాలని, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రోడ్లు త్వరగా దెబ్బతినకుండా బలమైన నిర్మాణంతో చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,500 కోట్ల వ్యయంతో 6,054 కిలోమీటర్ల మేర రహదారుల రెన్యువల్, కొత్త నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, నానో కాంక్రీట్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్వో ఆర్కే సింగ్, ఈఎన్‌సీలు రామచంద్ర, వివేకానందరెడ్డి, సీఈలు శ్రీనివాసరెడ్డి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.