BJP MP: లోక్‌సభకు రాజీనామా చేసిన 10 మంది బీజేపీ ఎంపీలు
రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్‌సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామాలు సమర్పించేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఎంపీల బృందం స్పీకర్‌ను కలిసింది. స్పీకర్‌ను కలిసిన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా,దియా కుమారి ఉన్నారు. చత్తీస్‌గఢ్ నుండి అరుణ్ సావో,గోమతి సాయి ఉన్నారు.
ఇంకా రాజీనామా సమర్పించని ఇద్దరు ఎంపీలు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అలాగే త్వరలో తన మంత్రివర్గానికి రాజీనామా కూడా చేస్తానని పేర్కొన్నారు. బాబా బాలక్‌నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామాలు సమర్పించలేదు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి మూడు రాష్ట్రాల్లో మెజారిటీ మార్కును దాటిన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు సెమీ ఫైనల్‌గా అభివర్ణించాయి.