Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం
మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్ల విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,బంగారం,వెండి,ఇతర ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు,ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నామని చెప్పారు. అయితే సాధారణ పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తనిఖీలు నిర్వహించాలని బృందాలను ఆదేశించినట్లు సీఈవో వివరించారు.
మద్యం ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు ఎండ్ టు ఎండ్ నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో మద్యం ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు మద్యం తరలింపుపై ఎండ్ టు ఎండ్ నిఘా ఉంచామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త పర్యవేక్షణలో భాగంగా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ని అమలు చేయడం ద్వారా మద్యం తరలింపును ట్రాక్ చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మేనేజింగ్ డైరెక్టర్‌ను CEO ఆదేశించారు. "డిస్టిలరీ / బ్రూవరీ నుండి APSBCL గోడౌన్‌కు మద్యం తరలింపును GPS ట్రాక్ చేయాలని, దాని ఫీడ్‌ను జిల్లా ఎన్నికల కార్యాలయ కంట్రోల్ రూమ్,CEO కంట్రోల్ రూమ్‌కు అందించాలి" అని మీనా ఒక ఆర్డర్‌లో తెలిపారు. మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.