Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. 100 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న తుఫాన్, వర్షాల కారణంగా ఒక్కరోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పరిస్థితిపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు 24 గంటల్లో ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యధికంగా ప్రయాగ్‌రాజ్‌లో 21 మంది మృతి చెందగా.. భదోహిలో 18 మంది, మీర్జాపూర్‌లో 15 మంది, ఫతేపూర్‌లో 10 మంది చనిపోయారు. ఉన్నావ్, బదౌన్‌లలో ఆరుగురు చొప్పున, ప్రతాప్‌గఢ్, బరేలీలో నలుగురు చొప్పున మృతి చెందారు. సీతాపూర్, రాయ్‌బరేలీ, చందౌలీలలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
ఒక్కసారిగా మారిన వాతావరణం
అలాగే కాన్పూర్ దేహాత్, హర్దోయ్, సంభల్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కౌశాంబి, షాజహాన్‌పూర్, సోన్‌భద్ర, లఖింపూర్‌లలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.భారీ దుమ్ము మేఘాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కమ్మేశాయి. ఈదురుగాలుల తీవ్రతకు హోర్డింగ్స్, టిన్ షెడ్లు ఎగిరిపోయాయి. రోడ్లపై ఉన్న పెద్ద చెట్లు కూలిపోవడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల ప్రజలు చెట్ల కింద, ఫ్లైఓవర్ల వద్ద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. బరేలీ జిల్లాలోని బమియానా గ్రామంలో జరిగిన ఘటన కలకలం రేపింది. బలమైన గాలులకు టిన్ షెడ్‌తో పాటు ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడి సుమారు 50 అడుగుల దూరంలో ఉన్న పొలంలో పడిపోయాడు.
వివరాలు
గోడ కూలి మహిళ మృతి
ఈ ఘటనలో నాన్హే మియాన్ అనే వ్యక్తికి చేతులు, కాళ్లు విరిగాయి. "తాడు పట్టుకుని ఉన్నాను.. ఒక్కసారిగా గాలి నన్ను, షెడ్‌ను ఎగరేసింది. ఎక్కడ పడిపోయానో కూడా తెలియలేదు" అని ఆయన మీడియాకు తెలిపారు. భదోహి జిల్లాలో గంగా నదిపై నిర్మించిన పాంటూన్ వంతెన దెబ్బతినడంతో పలువురు నదిలో పడిపోయినట్లు సమాచారం. మీర్జాపూర్‌లోని గౌరా ప్రమాణ్‌పూర్ వద్ద మరో పాంటూన్ బ్రిడ్జి దెబ్బతినడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఫతేపూర్ జిల్లాలో జరిగిన 10 మరణాల్లో ఎనిమిది ఖాగా తహసీల్‌లో నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. సదర్ తహసీల్‌లో గోడ కూలి ఓ మహిళ మృతి చెందినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ త్రిపాఠి తెలిపారు.
వివరాలు
ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదికలు
ప్రతాప్‌గఢ్‌లో గోడలు, షెడ్లు కూలడం, పిడుగుపాట్లతో నలుగురు మృతి చెందారు. కాన్పూర్ దేహాత్‌లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డియోరియాలో కూడా పిడుగుపాట్ల వల్ల ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా జరిగిన ప్రాణనష్టం, పశువుల నష్టం, ఇళ్ల ధ్వంసంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధిత కుటుంబాలకు 24 గంటల్లో సాయం అందించాలని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి మూడు గంటలకు ఒకసారి వర్షాలు, తుఫాన్ పరిస్థితులపై నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు.