LOADING...
TGSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు.. 500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రణాళికతో రద్దీ తగ్గింపు 
500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రణాళికతో రద్దీ తగ్గింపు

TGSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు.. 500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రణాళికతో రద్దీ తగ్గింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలో 12 ప్రదేశాల్లో కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఈ మార్చి నెలాఖరుకు కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభమవుతాయని, అందుకుగాను ఛార్జింగ్‌ స్టేషన్లను సమర్థవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే, ర్యాష్‌ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రాజెక్ట్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, కొత్తగా ఏర్పడుతున్న కాలనీల నుంచి వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా మరిన్ని బస్సులను నడుపుతున్నామని 'ప్రముఖ మీడియా'తో ముఖాముఖి సంభాషణలో వెల్లడించారు.

వివరాలు 

వచ్చే ఏడాది మార్చి లక్ష్యం 

2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అవసరం అని ప్రతిపాదనలో సూచించారు. ఈ క్రమంలో ఆగస్టు నెల వరకు 225 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుకున్నట్టు చెప్పారు. మిగిలిన 275 బస్సులు తరువాతి విధంగా వస్తాయని వివరించారు: నవంబరులో 50, డిసెంబరులో 50, జనవరిలో 50, ఫిబ్రవరిలో 50, మరియు మార్చిలో 75 బస్సులు అందించబడతాయి.

వివరాలు 

శి'వార్‌' రద్దీ నియంత్రణకు అదనపు ట్రిప్పులు 

రద్దీ సమస్యను తగ్గించడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో సాధారణ బస్సులకు తోడుగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ విద్యార్థుల బస్సు పాసులను అనుమతిస్తున్నామని తెలిపారు. శివార్‌ ప్రాంతాల్లో రద్దీ పరిస్థితులను బట్టి వివిధ డిపోల నుండి 108 బస్సులతో 864 అదనపు ట్రిప్పులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాక, ప్రధాన రూట్లపై 275 మెట్రో డీలక్స్‌ బస్సులను 15 నిమిషాల విరామంతో నడిపించనున్నట్టు తెలిపారు.

వివరాలు 

ప్రతిపాదనలు రాగానే పనులు 

కూకట్‌పల్లి, బాలానగర్, కాళీమందిర్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ కాలనీ, వేవ్‌రాక్, ఐఎస్‌సదన్, గండిమైనమ్మ, ఉప్పల్, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో కొత్త బస్సు టెర్మినళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆ ప్రతిపాదనలు ఆమోదం పొందిన వెంటనే, ఆర్థిక అవకాశాలను పరిగణనలోకి తీసుకొని, నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

వివరాలు 

క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు 

సిటీ బస్సుల్లో ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌ షెడ్యూల్‌ కచ్చితంగా పాటించడం ద్వారా మరమ్మతుల సమస్యలు రాకుండా చూసుకుంటున్నామని వివరించారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌ పాలసీ ప్రకారం విక్రయిస్తున్నట్లు చెప్పారు. ప్రతి బస్సుకు వార్షికంగా కాలుష్య తనిఖీలు నిర్వహించి, అది కాలుష్య పరిమితులకు లోబడి ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుమారు 26 బస్సుల కాలపరిమితి ముగిసింది, వీటిని స్క్రాప్‌ యార్డ్‌కి వేలం కోసం తరలిస్తున్నట్లు చెప్పారు.