Tamilnadu: ఎన్‌సీసీ క్యాంప్ అని పిలిచి.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పాఠశాలలో నకిలీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) శిబిరంలో కనీసం 13 మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారు. NDTV ప్రకారం, క్యాంపు నిర్వాహకుడు, పాఠశాల ప్రిన్సిపాల్, ఒక ఉపాధ్యాయుడు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆగస్టు 9న జరిగింది. ఈ మూడు రోజుల శిబిరంలో 17 మంది బాలికలతో సహా 41 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ఎన్‌సిసి యూనిట్ లేదు.
ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది?
శిబిరం నుండి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే 12 ఏళ్ల విద్యార్థిని అనారోగ్యానికి గురైంది, ఆ తర్వాత శిబిరానికి హాజరైన వ్యక్తి తనను ఆడిటోరియం నుండి బయటకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై ప్రిన్సిపాల్, టీచర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎలాంటి విచారణ లేకుండానే నకిలీ నిర్వాహకులతో స్కూల్ క్యాంపు నిర్వహించింది
పాఠశాలలో ఎన్‌సిసి యూనిట్ లేదని పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తే వారికి ఎన్‌సిసి అర్హత లభిస్తుందని నిర్వాహకులు పాఠశాల యాజమాన్యానికి తెలిపారు. పాఠశాల నిర్వాహకులను విచారించలేదని, ఎలాంటి విచారణ లేకుండానే నకిలీ శిబిరానికి పిల్లలను తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. శిబిరంలో మొదటి అంతస్తులోని ఆడిటోరియంలో బాలికలను, దిగువ అంతస్తులో అబ్బాయిలను ఉంచారు. నిర్వాహకులు రాత్రి సమయాల్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరాలకు పాల్పడ్డారు.
స్కూల్ పరువుపోతుందని.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అంగీకరించని ప్రిన్సిపల్..
ఈ విషయం తెలిసిన తర్వాత కూడా స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, విషయాన్ని గోప్యంగా ఉంచారని పోలీసులు చెబుతున్నారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.