LOADING...
Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్‌సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్‌తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం
33% రిజర్వేషన్‌తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం

Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్‌సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్‌తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది. పునర్విభజన బిల్లు నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా సుమారు 13 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా గణనీయంగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని లోక్‌సభ నియోజకవర్గాల పెంపును ప్రతిపాదిస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో రద్దైన తెనాలి వంటి నియోజకవర్గాలు కూడా మళ్లీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

ఈ జిల్లాల నుంచి ఎస్సీ మహిళలకు ప్రాతినిధ్యం

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా సుమారు 4.95 కోట్లు.ఇందులో మహిళల సంఖ్య 2.47 కోట్లు ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభలో కేవలం ముగ్గురు మహిళలకే ప్రాతినిధ్యం ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలైతే,రాష్ట్రం నుంచి 12 నుంచి 13 మంది మహిళలు లోక్‌సభలోకి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 84.69 లక్షలు ఉంది. ప్రస్తుతం నాలుగు లోక్‌సభ స్థానాలు వీరికి కేటాయించబడ్డాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే గుంటూరు,తూర్పుగోదావరి జిల్లాల్లో చెరో 9.57 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. కృష్ణా జిల్లాలో 8.71లక్షలు,పశ్చిమగోదావరి జిల్లాలో 8.23లక్షల మంది ఉన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ జిల్లాల నుంచి ఎస్సీ మహిళలకు ప్రాతినిధ్యం దక్కవచ్చు.

వివరాలు 

రాష్ట్రంలో మొత్తం ఎస్టీ జనాభా 27.40 లక్షలు

ఎస్సీ అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 4.82 లక్షలు, గుంటూరు జిల్లాలో 4.81 లక్షలు, కృష్ణా జిల్లాలో 4.35 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 4.13 లక్షల మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో ఈ జిల్లాల నుంచి ఎస్సీ మహిళలకు ప్రాతినిధ్యం లభించే అవకాశముంది. రాష్ట్రంలో మొత్తం ఎస్టీ జనాభా 27.40 లక్షలు. ప్రస్తుతం అరకు లోక్‌సభ నియోజకవర్గం ఈ వర్గానికి కేటాయించబడింది. జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 6.18 లక్షల మంది ఎస్టీ ప్రజలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2.97 లక్షలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2.85 లక్షలు, గుంటూరు జిల్లాలో 2.47 లక్షలు, విజయనగరం జిల్లాలో 2.35 లక్షల మంది ఉన్నారు.

Advertisement

వివరాలు 

ముందంజలో విశాఖపట్నం

ఎస్టీ మహిళల సంఖ్యలో కూడా విశాఖపట్నం జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 3.16 లక్షల మంది మహిళలు ఉండగా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1.40 లక్షల మంది ఉన్నారు. రిజర్వేషన్ల అమలు జరిగితే ఈ వర్గాల మహిళలకు కూడా రాజకీయ అవకాశాలు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement