Markapuram: మార్కాపురంలో ట్రావెల్స్ బస్సు-టిప్పర్ ఢీ.. 14 మంది సజీవదహనం
ఈ వార్తాకథనం ఏంటి
మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ రెండూ అగ్నికి ఆహుతయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం సుమారు 6 నుంచి 6.30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు
ఈ బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పలకల క్వారీల వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక మృతిచెందినట్లు తెలుస్తోంది. ముందుభాగంలో ఉన్న ప్రయాణికులు మాత్రం బయటపడగలిగారు. మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.