Loading...
Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు
28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు

Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది. దేశంలోని 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 251 మంది, 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా ఈ వివరాలను కోర్టుకు సమర్పించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని హన్సారియా అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

వివరాలు 

రాజ్యసభలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 75 మంది

అందులోని వివరాల ప్రకారం.. క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది లోక్‌సభ సభ్యుల్లో 170 మందిపై ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.

రాజ్యసభలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 75 మందిలో 40 మంది కూడా తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు.

2018 నుంచి సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను పర్యవేక్షిస్తున్నప్పటికీ.. పెండింగ్ కేసుల సంఖ్యలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కలిపి మొత్తం 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

వివరాలు 

14 మంది ముఖ్యమంత్రులపై కేసులు

దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి 29 కేసులతో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 19 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కేరళలో అత్యధిక శాతం ఎంపీలపై కేసులు

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కేరళలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.

ఆ రాష్ట్రానికి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యుల్లో 19 మంది అంటే 95 శాతం మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో 17 మంది ఎంపీలకు గాను 14 మందిపై కేసులు ఉన్నాయి. అంటే 82 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.

ఆ తర్వాత ఒడిశాలో 76 శాతం, జార్ఖండ్‌లో 71 శాతం, తమిళనాడులో 67 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ డేటా వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ దాదాపు 50 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రత్యేక కోర్టులపై కీలక సూచనలు

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సూచించారు.

ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు ఇతర కేసులను పక్కనపెట్టి ముందుగా ప్రజాప్రతినిధుల కేసులనే విచారించాలని పేర్కొన్నారు.

ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాతే ఇతర కేసులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే.. ఒక కేసులో ఛార్జీలు (చార్జ్) ఫ్రేమ్ చేసిన తేదీ నుంచి ఏడాదిలోగా విచారణను పూర్తి చేసేలా హైకోర్టులు నెలనెలా పర్యవేక్షణ చేపట్టాలని సిఫార్సు చేశారు.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు గతంలో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వాటి అమలులో ఆశించిన పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ADVERTISEMENT