Vijay malya: విజయ్ మాల్యా ఆస్తుల విక్రయంతో బ్యాంకులకు రూ.14 వేల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుల నుంచి ఈ ఏడాది రూ.22,280 కోట్లను వసూలు చేసినట్లు వెల్లడించారు. రుణ ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి, వేలం వేసి ఈ సొమ్మును వివిధ బ్యాంకులకు చెల్లించినట్లు వివరించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.14 వేల కోట్లు బ్యాంకులకు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను అమ్మకం చేయడంతో వెయ్యి కోట్ల రూపాయలను రాబట్టినట్లు స్పష్టం చేశారు. మెహుల్ చోక్సీకి సంబంధించిన రూ.2,566 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
రుణ ఎగవేతదారుల ఆస్తుల వేలం : సీతారామన్
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి చోక్సీ సుమారు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్లు తెలిపారు. జప్తు చేసిన ఆస్తులను వేలం వేసేందుకు ముంబై స్పెషల్ కోర్టు అనుమతులు ఇచ్చిందని, ఈ సొమ్మును PNBతో పాటు ఇతర బ్యాంకులకు చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, బ్యాంకులు సంయుక్తంగా తీసుకున్న చర్యల ద్వారా, కోర్టు ఆదేశాల ప్రకారం, మొత్తం రూ.22,280 కోట్లు రుణ ఎగవేతదారుల నుంచి రాబట్టి బ్యాంకులకు చెల్లించామని సీతారామన్ తెలిపారు. రుణ ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేయడం, వేలం వేసే ప్రక్రియ పీఎంఎల్ఏ చట్టం కింద జరుగుతోందని మంత్రి వెల్లడించారు.