LOADING...
Rajasthan : రాజస్థాన్‌లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. 15 మంది యాత్రికుల దుర్మరణం
15 మంది యాత్రికుల దుర్మరణం

Rajasthan : రాజస్థాన్‌లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. 15 మంది యాత్రికుల దుర్మరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని ఫలోదీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఆలస్యంగా జరిగిన ఈ దుర్ఘటనలో ఓ టెంపో ట్రావెలర్‌ నియంత్రణ కోల్పోయి,రహదారి పక్కన నిలిచివున్న లారీని ఢీకొట్టింది. ఈప్రమాదంలో 15మంది అక్కడికక్కడే మృతిచెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కోలాయత్‌ ఆలయ దర్శనం ముగించుకుని జోధ్‌పూర్‌ సమీపంలోని తమ స్వగ్రామం ఫలోదీకి తిరుగు ప్రయాణంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద వివరాల ప్రకారం..టెంపో ట్రావెలర్‌ భరత్ మాల ఎక్స్‌ప్రెస్‌వేపై అధిక వేగంతో ప్రయాణిస్తుండగా,మరో ట్రక్కును దాటేందుకు ప్రయత్నించే సమయంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా వాహనం రోడ్డు పక్కన పార్క్‌ చేసిన ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.ఢీ కొట్టిన తీవ్రతకు టెంపో వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది.దాంతో ప్రయాణికులు వాహనంలోనే ఇరుక్కుపోయారు.

వివరాలు 

మెరుగైన వైద్యం కోసం గ్రీన్‌ కారిడార్‌ ద్వారా జోధ్‌పూర్‌కు..

సమాచారం అందుకున్న వెంటనే ఫలోదీ పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించారు. సీట్ల మధ్య ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీయడం చాలా కష్టంగా మారిందని ఫలోదీ పోలీస్ స్టేషన్‌ అధికారి అమనారామ్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను మొదట సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్రీన్‌ కారిడార్‌ ద్వారా జోధ్‌పూర్‌కు పంపించారు.

వివరాలు 

రాష్ట్రపతి, ప్రధాని, సీఎం తీవ్ర దిగ్భ్రాంతి 

ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత హృదయ విదారకమైందని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి మోదీ రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ అధికారులను సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.