Amaravati: అమరావతి నిర్మాణానికి ఊతం.. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.16,000 కోట్ల రుణం
అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకుల కన్సార్షియం రూ.16,000 కోట్ల రుణం ఇవ్వనుంది. ఇందులో హడ్కో రూ.11,000 కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ రూ.5,000 కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. ఈ రుణానికి సంబంధించి సంప్రదింపులు మరికొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వానికి పూర్తి అధికారాలు అప్పగించడంతో సీఆర్‌డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కలిసి రూ.15,000 కోట్ల రుణం ఇవ్వడానికి ఒప్పందం ఖరారైంది. ఈ నెల 17న ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ ఒప్పందానికి తుది ఆమోదం లభించనుంది.
శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు
రుణాల సమీకరణ పూర్తి కావడంతో అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయి. రాజధాని నిర్మాణంలో ప్రధాన భవనాలైన హైకోర్టు, శాసనసభ, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల డిజైన్ల రూపకల్పన బాధ్యతను లండన్‌కి చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్‌కు మళ్లీ అప్పగించారు. ఈ సంస్థ గతంలోనే ఆకృతులను రూపొందించగా, జగన్ ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడంతో ఆ పనులు అప్పట్లో నిలిచిపోయాయి. టెండర్ ప్రక్రియలో నార్మన్ ఫోస్టర్ ఎల్1గా నిలిచిన నేపథ్యంలో, భవనాల పూర్తిస్థాయి నిర్మాణ బాధ్యతను తిరిగి చేపట్టనుంది. ఈ డిజైన్లలో దేశీయ భాగస్వాములుగా హఫీజ్ కాంట్రాక్టర్, జెనెసిస్ సంస్థలు వ్యవహరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలన్నీ ఐదు టవర్లలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పేదలకు పునరుద్ధరించిన పింఛన్లు
ముందుగా వివిధ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేసి, ఆ కార్యాలయాలన్నీ టవర్లలోనే ఏర్పాటు చేయనున్నారు. టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు త్వరలోనే పిలవనున్నారు. అమరావతి పరిధిలో భూమిలేని పేదలకు పింఛన్ల పథకాన్ని పునరుద్ధరించింది. గత ప్రభుత్వం రద్దు చేసిన పింఛన్లను తిరిగి అందించేలా చర్యలు చేపట్టడంతో 4,000 మంది పేదలకు మళ్లీ నెలకు రూ.5,000 చొప్పున పింఛన్లు అందుతున్నాయి. రాజధానిగా అమరావతిని కేంద్రం అధికారికంగా గెజిట్ ద్వారా ప్రకటించేలా కసరత్తు జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.