Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉమర్‌కు సహకరించిన కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో జరిగిన కారు పేలుడులో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఉమర్‌కు సాయంగా నిలిచిన, క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫోటో బయటకు వచ్చింది. జైష్-ఎ-మొహమ్మద్ ఆదేశాలతో అతడే పలువురు వైద్యులపై మానసిక ప్రభావం చూపి వారిని ఉగ్రవాద దారిలో నడిపించినట్టు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తతం డానిష్‌కు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. డానిష్ జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ఖాజిగుండ్ ప్రాంతానికి చెందినవాడు. పొలిటికల్ సైన్స్‌లో చదువుకున్న అతడిని శ్రీనగర్‌లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఆపరేషన్లలో అతడికి ప్రత్యేక నైపుణ్యం ఉండగా, అదే కారణంగా అధిక శక్తి గల పేలుడు పరికరాలను డ్రోన్ల సహాయంతో విస్ఫోటనం చేయాలనే కుట్రలో కీలకంగా వ్యవహరించినట్టు బయటపడింది.
వివరాలు
అధిక బరువు మోయగల బ్యాటరీలతో డ్రోన్లు
డాక్టర్ ఉమర్‌తో కలిసి ఈ ప్రణాళికను రూపొందించాడు. టెర్రర్ మాడ్యూల్‌లో అతడు కూడా ప్రధాన కుట్రదారుడిగానే పరిగణిస్తున్నారు. డ్రోన్ల ద్వారా, రాకెట్ల ద్వారా భారీ బాంబులను ఎలా దాడికి వినియోగించుకుంటారో... ఆ టెక్నికల్ సపోర్ట్ మొత్తం డానిష్ అందించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధిక బరువు మోయగల బ్యాటరీలతో డ్రోన్లను రూపొందించిన ఆధారాలు దర్యాప్తులో బయటపడ్డాయి. గతంలో చిన్న చిన్న ఆయుధాలను తీసుకెళ్లగల డ్రోన్లు అతడు తయారు చేశాడు. ఇప్పుడు పెద్ద స్థాయి పేలుళ్ల కోసం భారీ బాంబులను మోయగల డ్రోన్లను సిద్ధం చేస్తున్నాడు. లక్ష్యం—జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై చేశిన దాడులు, సిరియాలో ఇతర సంస్థలు చేసిన విధంగానే ఇదీ సమాన వ్యూహమని అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలు
కుల్గామ్‌లోని ఒక మసీదులో కలిసిన డానిష్-ఉమర్
ఇదే విధంగా డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా దాడులు చేయాలని డానిష్-ఉమర్ కలిసి పథకం రూపుదిద్దుకున్నట్టు విచారణలో తేలింది. డ్రోన్ ప్లాన్ నేపథ్యంలో, గత ఏడాది అక్టోబరులో కుల్గామ్‌లోని ఒక మసీదులో ఈ ఇద్దరూ కలిసినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఉమర్ డానిష్‌ను ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్శిటీ వసతి గృహానికి తీసుకువచ్చాడు. అక్కడే ఉమర్‌తో పాటు అతని స్నేహితులందరికీ డానిష్ తీవ్రవాద భావజాలాన్ని నాటినట్టు సమాచారం. నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్‌కు ఓవర్-గ్రౌండ్ వర్కర్‌గా పనిచేయాలని ఒత్తిడి చేశాడు. ఉమర్‌ను ఆత్మాహుతి దాడికి కూడా ప్రోత్సహించాడు. అయితే ఇస్లాం ప్రకారం ఆత్మహత్య పాపమని తెలుసుకున్న ఉమర్ ఆ ప్రణాళిక నుంచి తప్పుకున్నాడు.
వివరాలు
కారులో సరిగ్గా అమర్చలేని ఐఈడీ ఒక్కసారిగా పేలిపోయింది
దీంతో అతడు సాంకేతిక నైపుణ్యాలు ఉన్న కారణంగా డ్రోన్ మాడ్యూల్ నిర్వహణ వైపు ఉమర్‌ను పురికొల్పాడు. జేఎం ద్వారా ఆర్థిక సహాయం కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. డిసెంబర్ 6 దాడుల కోసం సిద్ధమవుతుండగా, ఈ క్రమంలో మరో సహచరుడు డాక్టర్ ముజిమ్ముల్ అరెస్టు కావడంతో ఉమర్ ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో కారులో సరిగ్గా అమర్చలేని ఐఈడీ బాంబ్ ఒక్కసారిగా ఎర్రకోట దగ్గర పేలిపోయింది.
వివరాలు
డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా భారీ దాడులు
ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ బ్లాస్ట్‌తో డాక్టర్ల బృందం నడిపించిన మొత్తం ఉగ్ర కుట్ర దేశం ముందుకు వచ్చింది. దర్యాప్తు సంస్థల ప్రకారం.. నవంబర్ 10న ఢిల్లీ కారు పేలుడు వెలుగులోకి రాకపోయి ఉంటే, డిసెంబర్ 6న దేశ వ్యాప్తంగా భారీ స్థాయి దాడులు జరిగే అవకాశం ఉండేదట. హమాస్ తరహాలో భారీ విధ్వంసం నుంచి దేశం తృటిలో తప్పించుకున్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.