
కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే వైరస్ కారణంగా ఇద్దరు చనిపోవడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడితో సహా నలుగురిలో నిఫా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఏడు గ్రామ పంచాయతీలను కేరళ ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కార్యాలయాలు, బ్యాంకులను అధికారులు మూసివేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 130 మందికి పైగా నమూనాలను పరీక్షించనట్లు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గబ్బిలాలు, పందులు, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
కేరళ
కోజికోడ్ మెడికల్ కాలేజీలో మొబైల్ ల్యాబ్ ఏర్పాటు
పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) బృందాలు కేరళకు చేరుకుని నిఫా పరీక్షలు, గబ్బిలాల సర్వే కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిపై కోజికోడ్ జిల్లా కలెక్టర్ గీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించామని చెప్పారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ కంటైన్‌మెంట్ జోన్‌లలోకి, బయటికి వెళ్లడానికి ఎవరూ అనుమతించబడరని పేర్కొన్నారు. బాధిత ప్రాంతాలను ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పోలీసులను కలెక్టర్ గీత సూచించారు. అయితే అవసరమైన వస్తువులు, మందులను విక్రయించే దుకాణాలు తెరిచే ఉంటాయని ఆమె చెప్పారు.