
కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నేతలు
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ నేతలు అడ్డుకొని, సంత భూమిని కబ్జా చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ నేత కబ్జా చేయడం ఏంటని ప్రశ్నించారు. శాంతిపురం మండలంలోని మోరసనపల్లెలో వారపు సంత జరిగే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేత బుల్లెట్ దండపాణి కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక నాయకులు ఇదే విషయాన్ని వైసీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ భరత్ దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన పట్టించుకోలేదు. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడిపల్లెలో ఓ ఆలయ కుంభాభిషేకానికి హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో శాంతిపురం వైసీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు.
కుప్పం
రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ నాయకులు
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై పోలీసులు వైసీపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. అయినా వైసీపీ నాయకులు పట్టు వీడుకుండా, మంత్రి కాన్వాయ్ ముందుకు కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై రోడ్డుపై బైటాయించి నిరసనకు దిగారు. సొంత పార్టీ నేతే సంత భూమిని కబ్జా చేశారంటూ మంత్రి పెద్దిరెడ్డిని గ్రామస్థులు, నాయకులు నిలదీయడంతో ఆయన కుంభాభిషేకానికి వెళ్లకుండా వెనుతిరిగారు. మంత్రి కూడా పట్టించుకోకపోవడంతో శాంతిపురం మండలంలోని 5గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజీనామాకు సిద్ధపడ్డారు.