LOADING...
Delhi: దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..
దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..

Delhi: దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య దిల్లీలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఖజురి ఖాస్ ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. మంగళవారం రాత్రి ఖజురి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిపై కాల్పులు జరిగాయని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని రాజా మేవతి అలియాస్ అక్కి అలియాస్ ఆకిబ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. హత్యకు కారణాలేమిటి.. దాడికి పాల్పడిన వారు ఎవరు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

వివరాలు 

ఈ నెల 24న కూడా ఢిల్లీలో కాల్పుల ఘటన

నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, మరోవైపు ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 24న కూడా ఢిల్లీలో ఇలాంటి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రోహిణి జిల్లా బేగంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ నగర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో రాజా అనే 21 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాలు 

ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ 

ఓ శుభకార్యానికి వచ్చిన వ్యక్తి తన వెంట తుపాకీ తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో బుల్లెట్ రాజా కడుపులోకి దూసుకెళ్లిందని వెల్లడించారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించామని, అతనికి చికిత్స కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement