Telangana: అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. కేంద్ర విదేశాంగ శాఖ జోక్యాన్ని కోరిన మంత్రి కోమటిరెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని బోస్టన్‌లో తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీజా రెడ్డి కోయా కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ (MEA), బోస్టన్ పోలీసులతో పాటు సంబంధిత అధికారులను కోరారు. మసాచుసెట్స్ యూనివర్సిటీ బోస్టన్‌లో శ్రీజ ఉన్నత విద్య అభ్యసిస్తోంది. నవంబర్ 2 నుంచి ఆమె కనిపించడం లేదని నవంబర్ 5న బోస్టన్ పోలీసులు మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేశారు.
వివరాలు
నవంబర్ 2న చివరిసారిగా కనిపించిన శ్రీజ
నల్గొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కొయ్య యాదగిరి రెడ్డి,రూప దంపతుల కుమార్తె శ్రీజ.
సుమారు ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికాకు వెళ్లింది.బోస్టన్‌లో చదువుకుంటూనే పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది.
అదృశ్యమయ్యే ముందు బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.
నవంబర్ 5న బోస్టన్ పోలీసులు జారీ చేసిన ప్రకటన ప్రకారం.. నవంబర్ 2న రాత్రి 9.45 గంటల సమయంలో డోర్చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్‌లో ఉన్న తన నివాసం నుంచి శ్రీజ బయటకు వెళ్లింది.
ఆ సమయంలో ఆమె నల్లరంగు జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె కార్సన్ బీచ్ లేదా హార్బర్ పాయింట్ ప్రాంతాల వైపు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వివరాలు
సమాచారం తెలిసిన వారు..
శ్రీజ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె గురించి ఏదైనా సమాచారం తెలిసిన వారు 911కు లేదా డోర్చెస్టర్ పోలీస్ డిస్ట్రిక్ట్ C-11 విభాగానికి 617-343-4335 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
క్రైమ్‌స్టాపర్స్ టిప్‌లైన్ 1-800-494-TIPSకు కాల్ చేయడం ద్వారా లేదా CRIME (27463)కు TIP అని మెసేజ్ పంపడం ద్వారా కూడా వివరాలు అందించవచ్చని తెలిపారు.
ఫొటోలు, వీడియోలను కూడా రహస్యంగా పంపవచ్చని పేర్కొన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని బోస్టన్ పోలీసులు వెల్లడించారు.
వివరాలు
ఐదు రోజులుగా పనిచేయని ఫోన్
శ్రీజ నవంబర్ 2న తన గది నుంచి వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదని ఆమె తండ్రి యాదగిరి రెడ్డి తెలిపారు.
ఆ రోజు కాలేజీకి వెళ్లి తిరిగి గదికి వచ్చిందని,కొంతసేపటి తర్వాత నడక కోసం బయటకు వెళ్లిందని చెప్పారు.
సుమారు కిలోమీటరు దూరం నడిచిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని వివరించారు.
అప్పటి నుంచి ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌లోనే ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీజ ఫోన్ చివరిగా పనిచేసిన ప్రదేశం ఆమె గదికి సమీపంలోనే ఉన్నట్లు తండ్రి పేర్కొన్నారు.
చివరిగా గుర్తించిన లొకేషన్ గదికి అర కిలోమీటరు దూరంలోనే ఉందని,ఆమె సమీపంలోనే ఉండి తిరిగి వస్తుందని పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
వివరాలు
విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి
అయితే ఐదు రోజులు గడిచినా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీజ అదృశ్యమైన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుకుంటూ కనిపించకుండా పోవడం బాధాకరమని ఎక్స్ (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.
వివరాలు
విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి
ఆమె ఆచూకీ కనుగొనేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బోస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, కేంద్ర విదేశాంగ శాఖ, బోస్టన్ పోలీసులను కోరారు.
ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా విభాగం దృష్టికి తీసుకెళ్లారు.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌తో పాటు తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో తెలుగు విద్యార్థిని అదృశ్యంపై మంత్రి చేసిన ట్వీట్
Deeply concerned over the reported disappearance of Ms. Sreeja Reddy Koya, a student from Nalgonda, Telangana, studying at UMass Boston.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) November 5, 2026
I urge @IndiainBoston, @IndianEmbassyUS, @MEAIndia, @DrSJaishankar, @KVSinghMPGonda, @kishanreddybjp, @bostonpolice, @CPVIndia to coordinate… pic.twitter.com/4qIXPKnF9T